జార్ఖండ్‌లో రైల్వే సేవను మనుషులు మాత్రమే కాకుండా జంతువులు వినియోగించుకుంటున్నాయి. ఆశ్చర్యపోకండి! ఇది నిజం. జార్ఖండ్‌లోని సిల్లి స్టేషన్ నుంచి ఖరగ్‌పూర్-రాంచీ లోకల్ రైలులో ఒక కోతి(లంగూర్) ఎక్కింది. సాధారణ ప్రయాణికులతో కలిసి జర్నీ చేసింది. కానీ మనుషుల్లాగే ఈ కోతి విండో సీటు తీసుకుందండోయ్.. ఏ ప్రయాణీకుడికి హాని కలిగించకుండా విండో సీటుపై కూర్చుని రాంచీ స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్‌లో కిందికి దిగి ఎక్కడికో వెళ్లిపోయింది.
READ MORE: Ahmedabad Plane Crash: పైలట్‌పై తీవ్ర ఆరోపణలు.. ఖండించిన పైలట్ సంఘాలు
కోతి లోకల్ రైలులో ప్రయాణించిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికుల సమాచారం ప్రకారం.. ఈ కోతి తరచుగా సిల్లి, రాంచీ మధ్య లోకల్ రైలులో ప్రయాణిస్తుంది. సిల్లి చుట్టూ ఉన్న అడవులలో నివసిస్తుంది. లంగూర్ ఆహారం కోసం రైలు ఎక్కి రాంచీకి వస్తుంది. ఆ కోతి రైలు కిటికీ పక్కన సీటుపై నిశ్శబ్దంగా కూర్చొంటుంది. ఏ ప్రయాణీకుడిని ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రశాంతంగా ప్రయాణం సాగిస్తుంది. రాంచీలో తిరుగుతూ తనకు ఇష్టమైన ఆహారాన్ని తిని.. మళ్ళీ లోకల్ రైలు ఎక్కి సిల్లి స్టేషన్‌కు తిరిగి వస్తుంది. అక్కడి ప్రజలకు ఇది సాధారణ విషయం. ప్రయాణంలో చాలా మంది తమతో తెచ్చుకున్న ఆహారాన్ని ఈ కోతికి తినిపిస్తారు. రైలులో ప్రయాణిస్తున్న ఈ కోతి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు వివిధ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ కోతి నిజంగా మనుషుల మాదిరిగానే తెలివైనదని కొందరు అంటున్నారు.