ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తారు. అమాయకులు, బలం లేని వాళ్లు ఉంటే ఇక అంతే.. బెదిరించడం లేదా దాడులు చేయడం కామన్ అవుతోంది. పైగా కొంత మంది అధికారుల అండదండలతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. కానీ అలాంటి వారికి చెక్ పెడుతున్నారు పోలీసులు. ఇదిగో ఇది ఆదిలాబాద్‌లోని మావల. ఇక్కడ ఓ వ్యక్తి 2011 కొనుగోలు చేసిన 7 ప్లాట్లను ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మరో రాజకీయ పార్టీ నేత కలిసి 2024లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డాక్యూమెంట్ రైటర్ డీల్ కుదర్చడంతో సబ్ రిజిస్ట్రార్.. ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లను మరోసారి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
Also Read:CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
ఐతే బాధితులు.. కొత్తగా వచ్చిన ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. RWS డీఈ నానం వెంకటరమణ, మావలకు చెందిన రాజకీయ నేత ఉష్కమల్ల రఘుపతి, రిమ్స్‌లో ఫార్మసిస్టుగా పనిచేసే బెజ్జవార్ సంజీవ్‌కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అంతేకాదు డబ్బులు లంచం తీసుకుని రిజిస్ట్రేషన్ అయిన భూమినే యజమానితో కాకుండా మరో వ్యక్తితో డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు మావల సీఐ స్వామీ వెల్లడించారు.
ఆదిలాబాద్‌లో కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠా భరతం పట్టారు పోలీసులు. బాధితుడు మిల్లింద్ కొర్తల్వార్ ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులు ఒరిజినల్ సేల్ డీడ్స్ ఉన్నా పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించారు. సబ్ రిజిస్ట్రార్ అశోక్‌కు రూ. 7 లక్షల లంచం ఇచ్చి అదే ప్లాట్లను మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారు. సుమారు రూ. 2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ జరిగినట్లు నిర్థారించారు. బాధితుల పిర్యాదులో 447, 427, 420, 467, 468, 471, 120-B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.