Sonia Gandhi: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌లు కలిశారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో నేతలు ఆమెను కలిశారు. జాతీయ రాజకీయాలు, విపక్ష పార్టీల ఐక్యతపై చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల తర్వాత మరోసారి సమావేశం అవుదామని సోనియా చెప్పారని నేతలు వెల్లడించారు. ప్రతిపక్షాలలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ప్రతిపక్షాల ఐక్యతకు మరింత చొరవ చూపాలని సోనియా గాంధీని కోరామన్నారు. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత నితీష్ కుమార్ సోనియా గాంధీని కలవడం గమనార్హం. 2015లో బీహార్ ఎన్నికల ముందు జరిగిన ఇఫ్తార్ విందులో సోనియాగాంధీని కలిశారు నితీష్.
జాతీయ స్థాయిలో బీజేపీ కూటమికి చెక్ పెట్టేందుకు అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు నితీష్ కుమార్. బీహర్ లో బీజేపీని వదిలి ఆర్జేడీతో జట్టుకట్టి అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో పర్యటించారు నితీష్ కుమార్. ఈ పర్యటనలో రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వామపక్ష నేతలను కలిశారు. వీరందరితో 2024 సాధారణ ఎన్నికలపై చర్చించారు. మరోవైపు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బీజేపీ టార్గెట్‌గా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పలు కేసుల్లో నిందితుడి ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న లాలూకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే వారంలో కిడ్నీ మార్పిడి కోసం ఆయన సింగపూర్ వెళ్లనున్నారు. ప్రస్తుతం లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ బీహార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
Nitish Kumar: దేశంలో థర్డ్ ఫ్రంట్ లేదు.. కాంగ్రెస్‌తో కలిసి ఒకటే కూటమి..
ఇవాళ హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగిన దేవిలాల్ జయంతి వేడుకల్లో మాట్లాడిన నితీష్ కుమార్.. దేశంలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని కోరారు. ఈ “ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్” 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే దేశాన్ని నాశనం చేసేందుకు పని చేస్తున్న వారిని తరిమికొట్టగలమని, హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు లేవని, అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో మనమంతా ఒక్కతాటిపైకి రావాలన్నదే తన కోరిక అని.. మరిన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని నితీష్ కుమార్ అన్నారు.