Sleeper Bus Safety: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వీ.కావేరి ట్రావెల్స్‌కి చెందిన వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున కల్లూరు మండలం చిన్నటకూరు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుంది. మొదట బైక్‌ను ఢీకొన్న బస్సు.. ముందు భాగంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం వ్యాపించింది. కొద్దిసేపటికే బస్సు మొత్తం బూడిదైంది. ఈ విషాద సంఘటనలో ఇప్పటివరకు 19 మంది మరణించినట్లు సమాచారం. పలువురి ప్రయాణికులకు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.
READ MORE: Kannada Beautys : టాలీవుడ్ సీనియర్ హీరోలతో కన్నడ కస్తూరీలు
ఈ నెలలో ఇది మొదటి ప్రమాదం కాదు. ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. అక్టోబర్ 14న, రాజస్థాన్‌లోని జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేపై ప్రయాణిస్తున్న ఏసీ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులతో సహా ఇరవై మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. గాయపడిన ఇద్దరు ప్రయాణికులు చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవలి ఈ సంఘటనలు బస్సు ప్రయాణ భద్రత గురించి ప్రశ్నలను లేవనెత్తాయి. ఇంతకీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సురక్షితమేనా..? అనే ప్రశ్న అందరి మదిలో ఉత్పన్నమవుతోంది.
READ MORE: Storyboard: టీడీపీ, జనసేన మధ్య వివాదాలేంటి..? ఎవరు గీత దాటుతున్నారు?
ప్రమాద అవకాశాలు..?
రెండు దశాబ్దాల ముందు వరకు మన దేశంలో మాములు లగ్జరీ బస్సులే తిరుగుతూ ఉండేవి. అనంతరం సుదూర ప్రయాణాలు పెరగడంతో ప్రయాణికుల సౌకర్యం కోసం స్లీపర్ బస్సులు వచ్చాయి. విదేశీ కంపెనీలు రావడంతో పాటు మెరుగైన జాతీయ రహదారులతో బస్సుల వేగం కూడా పెరిగింది. లగేజ్‌కు వాహనం కింది భాగంలో స్థలం కేటాయించడంతో బస్సు ఎత్తు బాగా పెరిగింది. దీంతో ప్రమాదం జరిగినా అంత ఎత్తు నుంచి దూకడం సవాల్‌గా మారింది. మల్టీ యాక్సిల్ బస్సులతో పాటు ఈ అధునాతన బస్సుల్లో 30 నుంచి 35 వరకు సీటు, స్లీపర్ సామర్ధ్యముంది. అయితే లోపల నడిచే దారి ఇరుకుగా ఉంటుంది. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు బయటకు రావడం ఇబ్బందిగా మారుతోందనే వాదన ఉంది. బస్సుల్లో అగ్నిమాపక నిరోధక వ్యవస్థ ఉండాలి. బస్సులను కూడా ఫైర్ప్రూఫ్గా నిర్మించాలి. ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలి అన్న అంశంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని రహదారి భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.
అనారోగ్య సమస్యలు..?
స్లీపర్ బస్సులలో ప్రయాణించడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మూసివేయబడిన విండోస్ కారణంగా ఇబ్బందులు కలుగుతాయట. బస్సు వంకర రోడ్లపై, పర్వత ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో వికారం, తలతిరగడంతో పాటు తలనొప్పికి కారణం అవుతుంది. టాయిలెట్లు లేనప్పుడు, స్టాప్‌లు తక్కువగా ఉన్న సమయంలో మోషన్ సిక్ నెస్‌కు గురయ్యే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎగుడుదిగుడుగా ఉండే ప్రయాణం, ఇతర వాహనాలు, ప్రయాణీకుల నుంచి వచ్చే శబ్దాల కారణంగా నిద్రకు అంతరాయం కలుగుతుంది. పొడవైన ప్రయాణీకులు ఇరుకైన బెర్త్ ల మీద పడుకుని ప్రయాణించాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఫిక్స్ డ్ బెర్త్ డిజైన్ కారణంగా వెన్నెముక, మెడపై ఒత్తిడి కలుగుతుంది. ముఖ్యంగా సుదూర ప్రయాణంలో ఈ సమస్యలు తలెత్తుతాయట.
READ MORE: Ponnam Prabhakar: తనిఖీలు చేయకపోవడం వల్లే ప్రమాదం.. టీజీ రవాణా శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
స్లీపర్ బస్సులలో ప్రయాణం చేసే సమయంలో టాయిలెట్స్ కు ఇబ్బంది ఉండటం వల్లన తక్కువగా నీళ్లు తాగుతారు. ఈ కారణంగా డీ హైడ్రేషన్ కలిగే అవకాశం ఉంటుంది. బస్సులో ఎక్కువగా తినడం లేదంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్లకు అజీర్ణం, కడుపు నొప్పికి కారణం అవుతుంది. ఎక్కువ గంటల పాటు కదలికలు లేకపోవడం వల్ల రక్తం గడ్డకట్టడంతో పాటు కాళ్ళ వాపు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది ఉండటం, పేలవమైన వెంటిలేషన్ కారణంగా ప్రయాణీకులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జలుబు సహా ఇతర ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.