Storyboard: ఏపీలో ఏడాదిన్నర పదవీకాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి.. సొంతింట్లోనే సమస్యలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కూటమిలో సమస్యలు రాకూడదని అటు చంద్రబాబు, ఇటు పవన్ మొత్తుకుంటున్నా.. రెండు పార్టీల నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటున్నారు. కొన్ని వ్యవహారాలు మంత్రుల స్థాయిలోనూ వివాదాస్పదం కావడంతో.. మరికొన్నింటిపై ఏకంగా క్యాబినెట్లో చర్చ జరగటం.. కూటమికి ఇబ్బందికరంగా మారింది. అప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో కూటమి సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేశారు. అయినా సరే ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన నేతలు సిగపట్లకు దిగుతున్నారు. నామినేటెడ్ పోస్టులు, నియోజకవర్గాల్లో తమ మాటే చెల్లాలనే పంతాలు.. ఇంకా ఇతరత్రా వ్యవహారాలు.. ఇలా కాదేదీ కొట్లాటకు అనర్హం అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. చివరకు రాజకీయాలతో సంబంధం లేని ఘటనలకు కూడా సీరియస్ గా రియాక్ట్ కావడం.. కొన్నింటిపై పైకి మాట్లాడకపోయినా.. లోలోపల ఇతర సంఘాల ద్వారా రాజకీయం చేయటం వంటి విషయాలు కూటమి సర్కారుకు తలబొప్పి కట్టిస్తున్నాయి. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలున్నాయి. కానీ సామాజికంగా, ఓటు బ్యాంకు పరంగా బలంగా ఉన్న టీడీపీ, జనసేన మధ్య ఎక్కువ వివాదాలొస్తున్నాయి.
అసలు కూటమి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే పిఠాపురంలో వర్మ సంగతేంటనే ప్రశ్న దూసుకొచ్చింది. తొలి విడత ఎమ్మెల్సీ పదవుల్లో వర్మకు చోటులేకపోవడంతో.. ఆయన వర్గం గొడవ చేసింది. ఆ తర్వాత రెండో విడతలోనూ ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో.. వర్మ చంద్రబాబును కలిసి తన సంగతేంటో తేల్చాలని కోరారు. దీంతో కొన్నాళ్లు సైలంట్ గా ఉండాలని చంద్రబాబు చెప్పారనే చర్చ జరిగింది. ఆ తర్వాత వర్మ కొన్నాళ్లు సైలంట్ గానే ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో నాగబాబు పిఠాపురంలో పర్యటించడం, ఈ టూర్ లో వర్మకు ప్రాధాన్యం దక్కకపోవడంతో.. ఆయన వర్గం అసంతృప్తికి లోనైంది. ఇదే అదనుగా వర్మ ముద్రగడతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. దీంతో అసలు పిఠాపురంలో ఏం జరుగుతోందన చర్చ మొదలైంది. దీనికి ట్విస్ట్ ఇస్తూ.. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ.. పిఠాపురంలో వర్మ సైలంట్ గా ఉండాలని చంద్రబాబు చెప్పారని, కూటమి సర్కారు ఉన్నంత కాలం ఇంతేనని మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై వర్మ డైరక్టుగా మాట్లాడకపోయినా.. పిఠాపురంలో తన బలమేంటో చంద్రబాబుకు తెలుసని, ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తానని హింటిచ్చారు.
ఆ తర్వాత నామినేటెడ్ పదవులపై టీడీపీ, జనసేన నేతలు పంతాలకు పోయారు. చివరకు చంద్రబాబు, పవన్ కూర్చుని మాట్లాడుకుని.. ఓ ఫార్ములా ప్రకారం పదవులు భర్తీ చేశారు. దీనిపై ఎవరూ మాట్లాడొద్దని ఇద్దరు అగ్రనేతలు ఆదేశించడంతో.. ఆ గొడవ సద్దుమణిగింది. కొన్నాళ్లకు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. తాను హోం శాఖ మంత్రిని అయ్యుంటే నిందితుల తాట తీసేవాడ్నని ఆయన మాట్లాడారు. దీంతో హోం శాఖ మంత్రి అనిత ఇరుకునపడ్డారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోనే ఉందని, పవన్ వ్యాఖ్యలపై రచ్చ చేయాల్సిన పని లేదని, ఆయనకు సమాచారం పంపుతామని చెప్పి కవర్ చేసుకున్నారు. అయితే అడపాదడపా పవన్ హోం శాఖపై తన ఆసక్తిని బయటపెడుతూ వచ్చారు. ఎప్పటికప్పుడు అనిత కూడా పవన్ వ్యాఖ్యల్ని కవర్ చేసుకోవాల్సి వచ్చింది. లేటెస్ట్ గా భీమవరం డీఎస్పీ వ్యవహారంలో పవన్ నేరుగా డీజీపీని నివేదిక కోరటంపై వివాదం రేగింది. అయితే డిప్యూటీ సీఎంగా పవన్ ఆదేశాల్లో తప్పులేదని హోం మంత్రి అనితతో పాటు పోలీస్ శాఖ కూడా ప్రకటనలు చేశారు. దీంతో ఆ వివాదం కూడా సద్దుమణిగేలా కనిపించింది. కానీ అనూహ్యంగా ఈ వివాదంలో వేలు పెట్టిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. పవన్ ఎంక్వైరీకి ఆదేశించిన అధికారి మంచివాడని కితాబివ్వడంతో పాటు.. పవన్ పై సెటైరికల్ కామెంట్స్ చేయడం జనసేనకు ఆగ్రహం తెప్పించింది.
ఇక పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న వ్యవహారాలపై నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ శాఖ మంత్రి నాదెండ్లకు కోపం తెప్పించాయి. ఆయన నెల్లూరుకు చెందిన మంత్రి నారాయణను నేరుగా నిలదీయడంతో పాటు.. ఇలాగే చేస్తే.. మీ శాఖ గురించి నేను కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్పేశారు. ఈ సంగతి నారాయణే సల్వయంగా నెల్లూరు జిల్లా నేతలతో పంచుకున్నారు. ఈ వ్యవహారంలో నారాయణ నాదెండ్లకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారాలన్నీ ఓ ఎత్తైతే.. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీటు పుట్టించాయి. వాటిపై చిరంజీవి కూడా వెంటనే రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు. బాలకృష్ణ చిరంజీవిని అవమానించినా పవన్ నోరెత్తలేదని వైసీపీ దెప్పిపొడిచింది. దీంతో వ్యవహారం ముదరక ముందే చక్కబెట్టాలని చంద్రబాబు డిసైడయ్యారు. హైదరాబాద్ లో జ్వరంతో బాధపడుతున్న పవన్ పరామర్శకు వెళ్లిన చంద్రబాబు.. పనిలోపనిగా ఈ ఇష్యూను సెటిల్ చేశారనే చర్చ జరిగింది. ఆ తర్వాత ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకపోవడంతో.. ఆ ఇష్యూ అంతటితో ఆగింది.
సరే టీడీపీ, జనసేన నేతలకు నేరుగా సంబంధం ఉన్న వ్యవహారాల్లో రచ్చ జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యవహారంలో కూడా ప్రభుత్వానికి ఊపిరాడని స్థితి రావడం మాత్రం నిజంగా చోద్యమే. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య రాజకీయ దుమారం రేపింది. బైక్‌పై వెళ్తున్న లక్ష్మీనాయుడును హరిశ్చంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి చంపారు. ఈ హత్య కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మృతుడి భార్యకు 5 లక్షల నగదుతో పాటు 2ఎకరాల భూమిని పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. లక్ష్మీనాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పవన్‌కు 5 లక్షల నగదు…4 ఎకరాల భూమితో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని హామీ ఇచ్చారు. భార్గవ్‌కు 3లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించనుంది ప్రభుత్వం. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి…కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
ఇక్కడ ఇద్దరు యువకుల మధ్య వివాదం హత్య వరకూ వెళ్లింది. అదికాస్తా రెండు ప్రధాన సామాజికవర్గాల సమస్యగా మారింది. దీంతో సీరియస్‌గా తీసుకుని దిద్దుబాటు చర్యలు ప్రారంభించంది ప్రభుత్వం. బాధితులకు నష్టపరిహారం ప్రకటించటంతో పాటు చెక్కులను కూడా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. సత్వర న్యాయం అందటంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ఏమాత్రం అటూఇటైనా.. రచ్చకు రెడీ అంటూ టీడీపీ, జనసేన వర్గాలు మోహరించాయి. అయితే పరిస్థితి అక్కడిదాకా రాకుండా కూటమి సర్కారు జాగ్రత్తపడటంతో.. కూటమిలో మరో వివాదం తప్పింది. ఇలా ఎప్పటికప్పుడు కూటమిలో కిందిస్థాయి నేతలు అధినేతల తలబొప్పి కట్టిస్తూనే ఉన్నారు. దీంతో అసలు విషయం కంటే.. ఈ పంచయతీలతోనే సమయం ఖర్చైపోతోందని అటు చంద్రబాబు, ఇటు పవన్ అంతర్గత సమావేశాల్లో వాపోయారు కూడా. అయినా సరే కింది స్థాయి నేతలు మాత్రం ఎప్పుడు గొడవపడదామా అనే మూడ్ లోనే కనిపిస్తున్నారు.