Site icon NTV Telugu

KTR : రేవంత్ రెడ్డి కట్టే వ్యక్తి కాదు కూలగొట్టే వ్యక్తి..

Ktr

Ktr

KTR : తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేతకాదని, కేవలం వ్యవస్థలను కూల్చడం మాత్రమే తెలుసని ఆయన మండిపడ్డారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, ప్రభుత్వం నడపడం ఈ “సన్నాసుల” వల్ల కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బూతుల భాష తప్ప మరే భాష రాదని ఆయన ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ మంత్రులైన వివేక్ వెంకటస్వామి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, , పట్నం మహేందర్ రెడ్డిలకు చెందిన అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. పేదవాడి ఇళ్లను కూలగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లకు వచ్చేసరికి వెనకాడుతున్నారని ఆరోపించారు. “రేవంత్ రెడ్డి కట్టే వ్యక్తి కాదు.. కూలగొట్టే వ్యక్తి” అంటూ ఆయన విమర్శించారు.

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం కట్టిస్తామన్న ‘ఇందిరమ్మ ఇళ్లు’ ఎక్కడ ఉన్నాయని కేటీఆర్ నిలదీశారు. ఒక్క ఇల్లు కట్టినట్లు చూపించినా తాము సమాధానం చెబుతామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలను మోసం చేయడమే తప్ప మరేమీ సాధించలేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన దృష్టిని పాలనపై కేంద్రీకరించాలని సూచించారు. “పదేళ్లు పందిలా బతకాల్సిన అవసరం లేదు.. గౌరవంగా బతకాలి” అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అశోక్ నగర్ , దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో విద్యార్థులు జాబ్ నోటిఫికేషన్ల కోసం ఆందోళన చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు వెళ్లిన ముఖ్యమంత్రి, పక్కనే ఉన్న అశోక్ నగర్‌కు వెళ్లి నిరుద్యోగులతో కలిసి టీ తాగి, వారి సమస్యలను విని ఉంటే బాగుండేదని హితవు పలికారు. విద్యార్థులను పిలిపించుకుని మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరుతున్న ఎమ్మెల్యేల తీరును కేటీఆర్ విమర్శించారు. పదిమంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారో, ఏ లింగమో వాళ్లకే తెలియదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రకాష్ గౌడ్ వంటి నేతలు పార్టీ మారుతున్నా, రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం ఎవరూ ఆపలేరని కేటీఆర్ స్పష్టం చేశారు.

Virat Kohli History: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. వన్డేల్లో ఎప్పటికీ చెరగని ముద్ర!

Exit mobile version