భారత క్రికెట్ చరిత్రలో వన్డే ఫార్మాట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఫార్మాట్‌లో అనేక మంది దిగ్గజాలు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. తమ ఆటతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. వన్డేల్లో మొదటి డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నారు. అలానే అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ మొదటి స్థానంలో ఉన్నారు. భారత్ తరఫున మొత్తం 463 వన్డే మ్యాచ్‌లు ఆడి.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు వెన్నుదన్నుగా నిలిచిన సచిన్.. వన్డేల్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు.
రెండో స్థానంలో భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఉన్నారు. ధోనీ భారత్ తరఫున 347 వన్డే మ్యాచ్‌లు ఆడారు. తన నాయకత్వంతో టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మక ట్రోఫీలను అందించాడు. మూడో స్థానంలో ‘ద వాల్’గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ నిలిచారు. 340 వన్డే మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్.. తన నిబద్ధత, స్థిరత్వంతో భారత మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముకగా నిలిచారు. ద్రవిడ్ ఆటలోని సహనం, క్రమశిక్షణ ఇప్పటికీ యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నాలుగో స్థానంలో మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఉండగా.. ఆయన భారత్ తరఫున 334 వన్డే మ్యాచ్‌లు ఆడారు. అజార్ కెప్టెన్సీ కాలంలో భారత్ అనేక కీలక విజయాలు సాధించింది.
ఐదో స్థానంలో ప్రస్తుత తరం దిగ్గజం విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు భారత్ తరఫున 309 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన జాబితాలో కొనసాగుతున్న ఏకైక యాక్టివ్ ప్లేయర్ కోహ్లీనే. అద్భుతమైన ఫిట్‌నెస్, దూకుడైన ఆటతీరు, స్థిరమైన ప్రదర్శనలతో కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆరవ స్థానంలో భారత క్రికెట్‌కు కొత్త దిశ చూపించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నారు. దాదా భారత్ తరఫున 308 వన్డే మ్యాచ్‌లు ఆడి.. యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతూ ఒక శక్తివంతమైన జట్టును నిర్మించారు. వడోదరలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కింగ్ బరిలోకి దిగడంతో దాదా రికార్డు బ్రేక్ అయింది. ఈ ఆటగాళ్లందరూ భారత వన్డే క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. వారి సేవలు, రికార్డులు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరగని ముద్రగా నిలిచిపోతాయి.
భారత్ తరపున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్ లిస్ట్:
# 463 – సచిన్ టెండూల్కర్
# 347 – ఎంఎస్ ధోనీ
# 340 – రాహుల్ ద్రవిడ్
# 334 – మహ్మద్ అజారుద్దీన్
# 309 – విరాట్ కోహ్లీ
# 308 – సౌరవ్ గంగూలీ