KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..

Ktr

Ktr

KTR: అధికారం రావడం పోవడం రొటీన్‌గా జరిగే తంతు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నాయకులు, ప్రభుత్వాలు మారుతుంటాయి. ప్రజల స్థితిగతులు మారుతున్నాయా లేదా అని ఆలోచించడం లేదని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జాయినింగ్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. అధికారం తమకు కొత్తేం కాదని వెల్లడించారు. మొన్ననే తమ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తిచేసుకుందని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతోపాటు బీఆర్ఎస్ మాత్రమే నిలబడ్డాయని చెప్పారు. అధికారంలోకి రాకుంటే కొంపలు అంటుకుపోతాయి అనుకోవద్దని నేతలకు సూచించారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ చిలుకకు చెప్పినట్టు చెప్పారని.. తొందరపడకండి ఆగమై ఓటు వేయకండి అని కేసీఆర్ కల్వకుర్తిలో చెప్పిన మాటలను గుర్తు చేశారు.

కేసీఆర్ రైతుబంధు ఇచ్చే సమయంలో ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.. పెద్ద రైతులకు ఎందుకు ఇస్తున్నారు అంటూ అడిగారన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా రైతుబంధు మాత్రం కేసీఆర్ ఆపకుండా ఇచ్చేవారని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడాలని ప్రజలకు సూచించారు. చాలా నియోజకవర్గాల్లో కేసీఆర్ గెలిస్తే చాలు ఈ ఎమ్మెల్యే మాకొద్దు అనుకుని తమ ఎమ్మెల్యేలను ఓడగొట్టారని కేటీఆర్ అన్నారు. అలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడగొట్టడం వల్లే కేసీఆర్ సీఎం కాలేకపోయారని తెలిపారు. “2023 తర్వాత మనకు చాలా షాక్‌లు తగిలాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఆ తర్వాత కేసీఆర్‌కి రెండోసారి ఫ్రాక్చర్ జరిగింది. మన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారి వెళ్లిపోయారు. ఇక రేవంత్ రెడ్డి మీద నాకు గెట్టు పంచాయతీ లేదు. ఇంకా వేరే గొడవ ఏమీ లేదు. కానీ ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్లు జనాలను మోసం చేశారు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుందని కేసీఆర్ చెప్పారు. కానీ మనం వినలేదు. ఎన్నికల ముందు కల్వకుర్తిలో సర్వే చేయించాం. మన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఓడిపోతాడని క్లియర్‌గా చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార మార్పిడి కావాలని చాలా మంది జనాలు భావించారు.” అని కేటీఆర్ వివరించారు.