కామారెడ్డి – కామారెడ్డి బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్దాయి సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి ఎన్నిక చేదు అనుభవం మిగిల్చింది. ఆ ఎన్నికల పై చర్చ వద్దు, జరిగింది జరిగిపోయిందన్నారు. గంప గోవర్ధన్ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని, త్వరలో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తినే పల్లెంలో మట్టిపోసుకున్నాం అనే భావన సామన్య ప్రజల్లో , రైతుల్లో ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి కామారెడ్డి నుంచి జైత్రయాత్ర మొదలు పెట్టాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేసి.. రంగుల కలల సినిమా చూపించి నోటికొచ్చిన హామిలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచారని, రాష్ట్రంలో గౌరవ ప్రదమైన ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల తప్పు లేదని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’రేవంత్ రెడ్డి తప్పు కూడా లేదు. ప్రజలు కోరుకునేదే చేస్తాం. మోసగాళ్లలో నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. గొర్రె కసాయిని నమ్మినట్లే.. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మారు. రుణమాఫీ అమలు చేయకపోతే రైతులు భరతం పట్టడం ఖాయం. 100 రోజులు అయ్యాక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే మహిళలే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు. రేవంత్ రెడ్డికి రైతుల పై ప్రేమ ఉంటే ఎన్నికల ఎన్నికల కోడ్ రాకముందే రైతులకు క్వింటాకు 500 బోనస్ ఇచ్చి చిత్తశుద్ది నిరూపించుకోవాలి. గెలిస్తే మగాడు, ఓడితే మగాడు కాదా..? నా సవాల్ ను రేవంత్ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజీగిరిలో పోటీ చేద్దాం ఎవరు మగాడో తేల్చుకుందాం. మా అయ్య పేరు కేసీఆర్, నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. రేవంత్ రెడ్డిలాగా రాంగ్ రూట్లో రాలేదు. ఆంద్రోళ్ల బూట్లు నాకి.. పార్టీలు మారి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డివి కారు కూతలు, చిల్లర మాటలు, ఇప్పటికైనా.. సీఎంలా హుందాగా మాట్లాడాలి. కాళేశ్వరం బృహత్తర ప్రాజెక్టు, మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే మూడు పిల్లర్లు కుంగిన మాట వాస్తవం.. కానీ కాళేశ్వరం కొట్టుకుపోలేదు, మేడిగడ్డ కొట్టుకుపోలేదు. ఈ ప్రభుత్వానికి మూడు నెలల్లో మూడు పిల్లర్లు బాగు చేసే సమయం దొరకడం లేదా.. ? రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు వొచ్చింది, కాలం తెచ్చిన కరువు కాదు, మార్చి 17 వరకు ఓపికగా పడతాం, 100 రోజులు పూర్తయ్యాక పాపం పండగానే ప్రజల్లోకి వెళ్తాం. జహీరాబాద్ సమావేశంలో అభ్యర్ధిని ఫైనల్ చేస్తాం. రైతుల పై ప్రేమ ఉంటే ఎన్నికల కోడ్ రాక ముందే క్వింటాకు 500 బోనస్ ప్రకటించాలి. రాష్ట్రంలో ఎండిన పంటలకు ఎకరానికి 10వేలు నష్టపరిహారం ఇవ్వాలి. 2లక్షల రుణమాఫీ తక్షణం ప్రారంభించాలి.’ అని కేటీఆర్ అన్నారు.