NTV Telugu Site icon

KTR: ఈ-కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం

Ktr

Ktr

KTR: ఈ-ఫార్ములా కార్‌ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని వెల్లడించారు. కేబినెట్‌లో మాట్లాడటం సరికాదని.. సభలో చర్చ చేద్దామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ-కార్‌ రేసింగ్‌పై విచారణకు గవర్నర్‌ ఆమోదంపై కేటీఆర్‌ తొలిసారి స్పందించారు. ఎవరి జైల్లో పెట్టాలని చూడటం ప్రభుత్వం చేయాల్సిన పనికాదన్నారు. తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్‌ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలల నుంచి మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సమస్యల పైన వారికి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పైన చర్చ పెట్టాలన్నారు.

Read Also: President Droupadi Murmu: శీతాకాల విడిదికి రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రజా సమస్యల పైన చర్చించిన తర్వాత.. రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న స్కాములపైన… ఫార్ములా- ఈ వంటి అంశాల పైన చర్చించినా తాము సిద్ధమన్నారు. కొడంగల్ ప్రజల కోసం నిలబడిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉక్కుమనిషిగా మారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భవిష్యత్తులో తుక్కుతుక్కు చేస్తాడన్నారు. భవిష్యత్తులో లగచర్ల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ నుంచి మొదలుకొని అన్ని హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు.

రైతు రుణమాఫీ ఎక్కడ 100 శాతం పూర్తి కాలేదని.. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లె కానీ లేదా తెలంగాణలోని ఏ గ్రామంలోనైనా ఈ సవాల్‌కు సిద్ధమని చెబితే ముఖ్యమంత్రి పారిపోయాడంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో 30 శాతం కూడా రైతు రుణమాఫీ కాలేదు.. కానీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని కాంగ్రెస్ కార్యకర్త దాకా సిగ్గు లేకుండా అబద్దాలు ఆడుతున్నారన్నారు. రుణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే రైతులు కచ్చితంగా కాంగ్రెస్‌కి బుద్ధి చెబుతారన్నారు. ఒక్క ఏడాది కాలంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై హామీలను అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. కేసీఆర్ బయటకు రావాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నారని.. ఆయనది కేసీఆర్ స్థాయి కాదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పట్నం నరేందర్ రెడ్డి తో పాటు లగచర్ల రైతుల బెయిల్ కోసం అన్ని రకాలుగా మా పార్టీ ముందు నుంచి కొట్లాడుతుందన్నారు.

Read Also: Sandhya Theatre stampede:సంధ్య థియేటర్‌ కి మరో షాక్?

ఇప్పటికే వారి బెయిల్‌కి సంబంధించిన వాదనలు పూర్తి అయ్యాయన్నారు. రేపు కోర్టులో మాకు న్యాయం లభిస్తుందన్న నమ్మకం ఉన్నదన్నారు. లగచర్ల బాధితులకు మేము అండగా ఉంటామన్నారు. దేశంలో జమిలీ ఎన్నికలు వస్తాయి అంటున్నారని.. అలా వస్తే మరో రెండేళ్లు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తప్పకుండా ఓడించి మనమే అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ అన్నారు.