తెలుగు చిత్రసీమలో ‘పట్టువదలని విక్రమార్కులు’గా పేరొందిన స్టార్స్ ఎవరంటే శోభన్ బాబు, కృష్ణంరాజు పేర్లే వినిపిస్తాయి. అయితే శోభన్ బాబు కంటే విలక్షణమైన రీతిలో కృష్ణంరాజు స్టార్ డమ్ చేరుకున్నారు. ప్రస్తుతం చిత్రసీమలో ఎవరైనా హీరోగా రాణించాలనుకుంటే, అలాంటి వారికి కృష్ణంరాజు స్ఫూర్తిగా నిలుస్తారు. ఎందుకంటే, సినిమా రంగంలో హీరోగా ఏ రోజుకైనా రాణించాలన్న అభిలాషతో కృష్ణంరాజు తనకు లభించిన ప్రతీపాత్రనూ అంగీకరించారు. ‘చిలక-గోరింక’ సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణంరాజు, ఆ సినిమా పరాజయంతో తనను తాను నిరూపించుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. అలాగని, ఆయనేమీ పేదరికంలో మగ్గినవారు కాదు. బంగారు చెంచాను నోట్లో పెట్టుకొని పుట్టినవారు. అయినా, ఏ నాడూ చిన్నాచితకా వేషాలు వేయడం నామోషీగా భావించలేదు. ‘తనకంటూ ఓ రోజు వస్తుందని’ ఎదురుచూసి, సరైన సమయంలో తన ప్రతిభను చాటుకున్నారు. ‘రెబల్ స్టార్’గా జనం మదిలో నిలచిపోయారు. అందువల్లే నవతరం నటులకు కృష్ణంరాజు ముందుగా స్ఫూర్తి కలిగిస్తారు.
తన సొంత చిత్రాలు “కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం”తో స్టార్ డమ్ చేరుకున్న కృష్ణంరాజు, ఆ పై తమ ‘గోపీకృష్ణా మూవీస్’ను సైతం ఓ అభిరుచిగల నిర్మాణ సంస్థగా తీర్చిదిద్దారు. తన తమ్ముడు యు.సూర్యనారాయణ రాజు (ప్రభాస్ నాన్న) నిర్మాతగా పెట్టి జనం మెచ్చే చిత్రాలు తెరకెక్కించారు కృష్ణంరాజు. వారి గోపీకృష్ణా మూవీస్ పతాకంపై “మనవూరి పాండవులు, శివమెత్తిన సత్యం, సీతారాములు, బొబ్బిలి బ్రహ్మన్న” సినిమాలు నిర్మించి, వాటిలో విలక్షణమైన పాత్రలు ధరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నంది అవార్డులలో ఉత్తమనటుడు విభాగం ప్రవేశ పెట్టగానే, ఆ కేటగిరీలో ‘అమరదీపం’ ద్వారా ఉత్తమనటునిగా నిలిచారు కృష్ణంరాజు. అలా నంది అవార్డు అందుకున్న తొలి ఉత్తమనటుడుగా చరిత్రలో నిలచిపోయారు కృష్ణంరాజు. సొంత చిత్రాలను మినహాయిస్తే, బయటి చిత్రాలలో విజయమాధవీ పిక్చర్స్ పతాకంపై దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు నటించిన ‘కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ’ మాస్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాల తరువాతనే కృష్ణంరాజు ‘రెబల్ స్టార్’గా అభిమానుల మదిలో నిలిచారు. ‘రెబల్ స్టార్’ అన్న ముద్ర ఉంది. పైగా మాస్ ను ఆకట్టుకొనే రూపం కృష్ణంరాజు సొంతం. అయినా ‘మనవూరి పాండవులు, సీతారాములు, మధురస్వప్నం” వంటి చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించారాయన. ఇవన్నీ ఆయన సొంత చిత్రాలే కావడం గమనార్హం! ఇక తమ మొగల్తూరుకే చెందిన చిరంజీవిని తన “మనవూరి పాండవులు, ప్రేమతరంగాలు, పులి-బెబ్బులి” వంటి చిత్రాల ద్వారా ప్రోత్సహించారు కృష్ణంరాజు.
కృష్ణంరాజు రాజకీయ జీవితం కూడా తొలుత పరాజయాలతోనే మొదలు కావడం గమనార్హం! 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. అయితే బీజేపీ అభ్యర్థిగా 1998లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విజేతగా నిలిచారు. ఆ తరువాత 1999లో బీజేపీ అభ్యర్థిగానే నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు స్టేట్ మినిస్టర్ ఫర్ ఎక్సటర్నల్ అఫైర్స్ గానూ విధులు నిర్వర్తించారు. చిరంజీవి నెలకొల్పిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరి రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చేసి 2009లో ఓటమి చవిచూశారు కృష్ణంరాజు. తరువాత మళ్ళీ నటనపై దృష్టిని కేంద్రీకరించి, తన దరికి చేరిన పాత్రలను పోషించారు. తన నటవారసుడు ప్రభాస్ తో తమ గోపీకృష్ణామూవీస్ పతాకంపై నిర్మించిన ‘రాధేశ్యామ్’లో కృష్ణంరాజు చివరగా నటించారు.
చిత్రసీమను నమ్ముకుంటే, తల్లిలా కాపాడుతుందని ఎందరో అంటారు. ఆ మాటను నిజం చేసి చూపించిన చరిత కృష్ణంరాజు సొంతం. ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో కృష్ణంరాజు నటనాపర్వం భావితరాలకు స్ఫూర్తి కలిగించక మానదు.