తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి తెలిపారు. కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి తాను ఒక్కసారే వెళ్లాలని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ ఎంతో కష్టపడ్డామని.. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంతన్న అని పేర్కొన్నారు. సీఎం, తమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కొండా మురళి స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడొద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారని, మీనాక్షి అమ్మ చెప్పినట్లు తాను వింటానని చెప్పుకొచ్చారు.
సిమెంట్ కంపెనీ యాజమాన్యాలను కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను బాధ్యతల నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్దకు సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రావడం, వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకోవడం జరిగింది. పోలీసులతో సుస్మిత వాగ్వాదం, ప్రశ్నలు అడగడంతో జూబ్లీహిల్స్‌లోని మంత్రి సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో హనుమకొండలో కొండా మురళి మీడియాతో మాట్లాడారు.
‘సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదు. కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాము. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంతన్న. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు. ఈ రోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్‌తో ప్రోగ్రామ్ ఉంది. జరుగుతున్న పరిణామాలను తెలుసుకుని స్పందిస్తాను. కొండా సురేఖ హైదరాబాద్‌లో ఉన్నారు, ఈ రోజు వరంగల్ తూర్పులో సమావేశానికి హాజరవుతారు. ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, తప్పకుండా ఇస్తారు. కొండా సుస్మితతో ఇప్పుడే మాట్లాడాను. తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది’ అని కొండా మురళి చెప్పారు.
‘అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. నేను మంత్రుల వద్దకు వెళ్తాను, సమస్య సమసిపోయేలా చూస్తాను. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను. పీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా’ అని కొండా మురళి తెలిపారు.