Kollu Ravindra: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర.. సీఎం వైఎస్ జగన్ చెప్పేవన్నీ నిజాలైతే బహిరంగ చర్చకు ఎందుకు వెన్ను చూపుతున్నారు సజ్జల..? అని ప్రశ్నించారు. జగన్ ఏమి అబద్దాలు చెప్పారో చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురు ప్రశ్న వేశారు? బహిరంగ చర్చకు ఎందుకు రావాలని మరో ప్రశ్న వేశారు? హామీల్లో 99.5 శాతం అమలు చేశామని జగన్ పదే పదే చెప్పేవి పచ్చి అబద్దాలు అని మండిపడ్డారు.
Read Also: AIOBCSA: రాయలసీమలో అధిక ఎమ్మెల్యే స్థానాలు బీసీలకు కేటాయించాలి..
టీడీపీ మేనిఫెస్టో నెట్ నుంచి తొలగించారని చెప్పేది కూడా కొండంత అబద్ధం అని కొట్టిపారేశారు కొల్లు రవీంద్ర.. మద్య నిషేదం చేసి ఓట్లు అడుగుతానని, వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని మాట తప్పారని దుయ్యబట్టిన ఆయన.. విద్యుత్ ఛార్జీలు పెంచనని, అంగన్‌వాడీలకు తెలంగాణ రాష్ట్రానికన్నా రూ.1,000 అదనంగా ఇస్తానన్న జగన్ మడమ తిప్పారని దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, రాజధానిగా అమరావతిని మార్చమని జగన్ మాట మార్చారన్న ఆయన.. ధరలు అదుపులో పెడతామని, ఇద్దరు బిడ్డలకు అమ్మ ఒడి ఇస్తామని ఇలా జగన్ రెడ్డి చెప్పలేదా..? చెప్పినవన్నీ జగన్ చేశారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇచ్చిన హామీల్లో 85 శాతం అమలు చేయకుండా మాట తప్పి మడమ తిప్పారు.. అంతే కాకుండా 99 శాతం హామీలు అమలు చేశామని జగన్ రెడ్డి అబద్దాలు చెప్పారు. దీనిపై బహిరంగ చర్చకు చంద్రబాబు సవాల్ చేశారని గుర్తుచేశారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర.