Kodali Nani: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇక, టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్లు చెబితేనే ఒంటికాలితో లేచే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఈ పొత్తులపై వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంలో వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 2,322 మంది లబ్ధిదారులకు నాలుగుకోట్ల 35లక్షల 37వేల 500 రూపాయల చెక్కును అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు అన్నారు. జనసేన, బీజేపీని కలుపుకుని ఎన్నికలకు వస్తున్నాడు.. రాజకీయంగా, ఆర్ధికంగా తను బాగుపడాలన్నదే చంద్రబాబు ఆలోచన అని దుయ్యబట్టారు.
Read Also: CAA: అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
ముస్లింలు, క్రైస్తవులకు బీజేపీ అన్యాయం చేసిందంటాడు.. మళ్లీ అదే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాడు అని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తిట్టాడు.. ఇప్పుడు మోడీ గొప్పోడంటున్నాడు అని ఎద్దేవా చేశారు. మోడీని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడన్న ఆయన.. అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎవరి కాళ్లైనా నాకుతాడు అంటూ హాట్ కామెంట్లు చేశారు. మంచి జరిగితేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇక, పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసినా వైసీపీని ఓడించలేరు.. జగన్ మోహన్ రెడ్డిని రెండవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలి.. తుప్పట్టిన సైకిల్ ను రాబోయే ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించి.. బుడమేరులో పడేయాలి అంటూ పిలుపునిచ్చారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.