KL Rahul: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్స్ స్థానాల కోసం జట్లు అమీ తుమి తేల్చుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతి జట్టు కనీసం ఏడు మ్యాచులు ఆడడంతో సగం ఐపీఎల్ సీజన్ ముగిసినట్లయింది. ఇకపోతే ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ప్లేఆఫ్ స్థానాల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయనందుకొని పాయింట్ల పట్టికలో ఆరు విజయాలతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇదిలా ఉండగా, గత రాత్రి మ్యాచ్ అనంతరం జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2024 సీజన్ లో కెఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ టీంకి కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో భారీ ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు యజమాని గోయెంకా అందరి ముందరే స్టేడియంలోనే కెప్టెన్ అయిన కెఎల్ రాహుల్ ని ప్రశ్నించిన ఘటన అప్పట్లో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ విషయంలో జట్టు యజమానిపై క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. దాంతో వారిరువురి మధ్య పరస్పర సంబంధాలు కాస్త దెబ్బ తిన్నట్లుగా కూడా తెలిసిందే. ఇక 2024 ఐపీఎల్ సీజన్ తర్వాత కేఎల్ రాహుల్ ను లక్నో సూపర్ జెయింట్స్ టీం మేనేజ్మెంట్ రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలం పాటలోకి రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ ను దక్కించుకుంది.
Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic
— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025
ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టుపై కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ఐపీఎల్ లో 5000 పరుగులు మైలు రాయిని దాటాడు. ఇక మ్యాచ్ తర్వాత అనంతరం తోటి ఆటగాళ్లకు షాక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత లక్నో జట్టు యజమాని రాహుల్ గోయెంకా వైపు వెళ్ళాడు. అలా వెళ్లిన అతడు లక్నో యజమానికి, అలాగే అతని కుమారుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో గోయెంకా.. రాహుల్ ని మాట్లాడించడానికి ప్రయత్నించిన అవేమీ పట్టనట్టుగా అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్లిపోయాడు. దాంతో గోయెంకా ముఖం విచారకరంగా ఉన్నట్లుగా వైరల్ అవుతున్న వీడియోలో అర్థమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎవరికైనా మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే వస్తుందని.., కేవలం డబ్బులు ఉండి కళ్లు నెత్తికెక్కితే చివరికి ఇలానే జరుగుతుందంటూ కామెంట్ చేస్తున్నారు.