Site icon NTV Telugu

Kishan Reddy : ధరణి పోర్టల్ ప్రజలకు గుదిబండగా మారింది

Kishan Reddy

Kishan Reddy

నిర్మల్ లో నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు. అక్కడినుంచి బీజేపీ నాయకులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్మల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజులుగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. జీవో 220కి వ్యతిరేకంగా.. స్థానిక ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితోపాటు నిర్మల్ జిల్లా యువత, రైతులు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. మీ కృషి కారణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిందని, మహేశ్వర్ రెడ్డి ధైర్యంగా నిర్మల్ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలను ఎదిరించేందుకు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు

Also Read : Posani Krishna Murali: నేను చస్తే.. నా శవాన్ని కూడా వారికి చూపించొద్దు

అంతేకాకుండా.. ‘నిర్మల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ భూమిని.. ఎమ్మెల్యే కుటుంబసభ్యుల భూ వ్యాపారానికి కావాల్నా? ఇదెక్కడి న్యాయం. నిర్మల్ ప్రజలు వ్యతిరేకిస్తున్నరని.. కొన్నిరోజులు వెనక్కు తీసుకున్నట్లు నాటకాలాడి మళ్లీ.. తెరపైకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు మన ప్రభుత్వం మరోసారి రాదని అర్థం కావడంతోనే ఆదరబాదరాగా ఈ జీవోను తీసుకొచ్చి ఆర్థికంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రమంతా ఇదే సమస్య ఉంది. అధికార పార్టీ నాయకుల అక్రమ భూదంధాలు కొనసాగుతున్నాయి. అసైన్డ్ భూములు, గ్రామ కమతాలు.. ఇట్లా ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేస్తున్నారు. ధరణి పోర్టల్ లో అక్రమంగా ఇలాంటి భూములను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ధరణి పోర్టల్ ప్రజలకు గుదిబండగా మారింది. ధరణి కారణంగా అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నరు. ఇవన్నీ కేసీఆర్ కుటుంబం చేసిన హత్యలే. కేసీఆర్ కుట్రపూరిత ఆలోచనలతోనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి.’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version