తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 4వ బహిరంగ లేఖ రాశారు. విభజించి పాలించే బ్రిటిషర్ల పాలనా విధానాన్ని మీరు చాలా చక్కగా ఆకళింపు చేసుకుని పాటిస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా.. మీ ఆలోచనలు, మీ నాయకుల స్వలాభం కోసం జిల్లాల విభజన జరగడం.. దీనికి మంచి ఉదాహరణ అని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరుగుతుంటే ఒక ప్రజాప్రతినిధి పక్క జిల్లాలోని మండలాన్ని తన జిల్లాలో బలవంతంగా కలిపేసుకున్నాడు అన్నారు. కారణం అన్వేషిస్తే.. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా సదరు మండలంలో స్థిరపడిన తన బావమరిదిని ఎమ్మెల్యేగా నిలబెట్టేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకేనట తెలిపారు. చాలామంది ప్రజాప్రతినిధులు భూములను బినామీ పేర్లతో కొని జిల్లాలను ఏర్పాటు చేయించుకున్నారు. ఇప్పుడు చాలా జిల్లాల కార్యాలయాలు ఆయా భూములకు దగ్గర్లోనే వెలిశాయని తెలిపారు. అసలు చిన్న జిల్లాలను ఏర్పాటు చేయమని మిమ్మల్ని ఎవరడిగారు? ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రజలను తెలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న అని తెలిపారు.
ఉదాహరణకు పాత పాలమూరు జిల్లాను తీసుకుంటే, ఈ జిల్లా.. పాల్మాకుల నుండి రాజోలు వరకు యాసగొంది నుంచి నల్లమల వరకు సరిహద్దులు కలిగిన ఇంచుమించు ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రమంత సైజు ఉండేదన్నారు. అక్కడ ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు అంత పెద్ద జిల్లాకు ప్రజాప్రతినిధులమని మురిసిపోయేవారని అన్నారు. వారి ఆధిపత్యం తగ్గించేందుకు మీరు పన్నిన కుట్ర వారికి అర్థం కాలేదు. ఎవరు కోరకుండానే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టారని తెలిపారు. మీ అనుచరుడైన ఓ ప్రముఖ వ్యక్తికి కావలసిన సహకారం అందించేందుకు రంగారెడ్డి జిల్లాను, పాలమూరు జిల్లాను హత్య చేసి ‘కొత్త రంగారెడ్డి’ జిల్లాను సృష్టించి ఇచ్చారని అన్నారు. ఇది ప్రజలకు అర్థం కాకుండా మీ పార్టీ వారిచేత ఎక్కడికక్కడ ఆందోళనలు జరిపించారు. ఈ విభజన ఎంత అశాస్త్రీయమో తెలుసుకునేందుకు మరో ఉదాహరణ ప్రజల ముందు పెడతానని అన్నారు. నగర శివార్లలోని శంకర్‌పల్లిని 15 కిలోమీటర్ల దూరంలోనున్న సంగారెడ్డి జిల్లాలో కలపకుండా సుదూరంలో ఉన్న శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డిలో కలిపేశారని తెలిపారు.
Read also: Telangana Elections 2023: తెలంగాణలో అగ్ర నేతల పర్యటన.. జన సమీకరణకు పార్టీల భారీ ఆఫర్స్
జిల్లాలను చిన్న సైజులోకి మార్చి ఆయా మంత్రులను చిన్న ప్రాంతాలకే.. పరిమితం చేయడానికి మీరు పన్నిన పెద్ద వ్యూహమే ఈ చిన్న జిల్లాల ఏర్పాటు అని మండిపడ్డారు. అవసరం ఉన్నా, లేకున్నా ఒక్కో జిల్లాను నాలుగు జిల్లాలుగా మార్చి పరిపాలనను అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడు ఈ జిల్లాలోనూ సుపరిపాలన లేదు. జిల్లా అధికారులు దీర్ఘకాలిక ప్రణాళికతో కాకుండా.. స్కీములు అమలు చేసే బంట్రోతులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సంవత్సరం జిల్లా విభజన.. మరో సంవత్సరం ఎన్నికలు.. తర్వాతి సంవత్సరం ధరణి.. ఆ తర్వాత మరొకటి. ఇదీ మీ పంచవర్ష ప్రణాళిక! ఈ కొత్త జిల్లాల అధికార యంత్రం చేస్తున్న పాలనాపరమైన తప్పులతో ప్రజలు విసిగిపోతున్నారని తెలిపారు. ఈ విసుగు.. ఓచోట తహసీల్దార్‌ను కిరోసిన్ పోసి తగలబెట్టేసేంతవరకు పెరిగింది. ఇంకొన్ని చోట్ల ఎందరో రైతుల భూములు.. వారి పేర్లతో నమోదు కావడం లేదన్నారు. వారు ఆత్మహత్యలు పాల్పడుతున్నా మీకు పట్టింపులేదు. అధికార వికేంద్రీకరణ పేరుతో జిల్లాల్లో జరిగిన విభజన వల్ల ప్రభుత్వంలో లంచగొండితనం భయంకరంగా పెరిగింది ప్రజల అష్ట కష్టాలు పడుతున్నారని అన్నారు.
మీరు ఎన్నికల్లో గెలిచేందుకు అనుకూలంగా జిల్లా సరిహద్దులు సృష్టించారు. కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేశారు. ఇదంతా మీ స్వలాభం కోసమే తప్ప ప్రజల కోసం కాదు ఇష్టారాజ్యంగా జిల్లాలు విభజించినట్లుగా జోన్లనూ విభజించారు. మీకు కావలసిన అధికారులను ఉద్యోగులను అన్ని జిల్లాల నుండి హైదరాబాద్‌కు రప్పించుకున్నారు. కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు లేక అల్లాడుతుంటే పాత జిల్లాల్లో ఆఫీసులు ఎక్కువై.. వాటిని ఊడ్చే దిక్కు లేని పరిస్థితి. అలాగే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు కట్టించిన ఎమ్మెల్యేల అధికార కేంద్రం నుంచి ఎంతమంది పాలన కొనసాగిస్తున్నారో.. మీరు చెప్పగలరా? 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి ప్రజలను గాలికి వదిలేసారు. అందుకే.. మీ అశాస్త్రీయ పరిపాలన తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు? ఈ జిల్లాల విభజనపై ఓ శ్వేతపత్రం విడుదల చేయగలరా? లేదంటే హైకోర్టు సిట్టింగ్ న్యాయ విచారణకు ఆదేశించగలరా? రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేసి.. ప్రజలను నడిరోడ్డుపై నిలబటెట్టి.. మీరు, మీ కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న మీకు, మీ పార్టీకి రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెబుతారని లేఖలో తెలిపారు.
Telangana Elections 2023: తెలంగాణలో అగ్ర నేతల పర్యటన.. జన సమీకరణకు పార్టీల భారీ ఆఫర్స్