Kishan Reddy Letter to Cm Revanth Reddy: ఎయిమ్స్ బీబీనగర్ కు అనుబంధంగా అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ (UHTC) ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరం నడిబొడ్డున 2 ఎకరాల భూమిని కేటాయించాలని, అప్పటి వరకూ తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని కోరుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసారు. ఈ లేఖలో.. దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడానికి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మొదలుకొని అన్ని స్థాయిలలో ఆరోగ్య కేంద్రాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులో ఉంచడానికి మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని., అందులో భాగంగానే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎయిమ్స్ ఆసుపత్రులను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పుతోందని., అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా 2019 లో బీబీనగర్ లో రూ. 1,300 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం మీకు తెలిసిందే అంటూ పేర్కొన్నారు.
ఇకపోతే ప్రస్తుతం ఎయిమ్స్ బీబీనగర్ లో ఓపీడీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్ మెడికల్ కాలేజీని కూడా కొత్తగా ఏర్పాటు చేయడం, ప్రస్తుతం వైద్య కళాశాల తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్ నూతన భవనాలు చాలా వేగవంతంగా నిర్మాణం జరుగుచున్నవి. ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ నగరంలో ఒక అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ (UHTC) ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ద్వారా వైద్య విద్యార్థులకు అవసరమైన బోధన & శిక్షణ కార్యక్రమాలను, నగరంలో నివశిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఉంటుంది.
ఎయిమ్స్ బీబీనగర్ ఎక్స్టెన్షన్ కోసం హైదరాబాద్ నగరంలో తాత్కాలికంగా ఒక ప్రభుత్వ భవనాన్ని కేటాయించినట్లయితే, అక్కడ ఎయిమ్స్ బీబీనగర్ కు అనుబంధంగా అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ (UHTC) ను ఏర్పాటు చేసి, నగరంలో నివసిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకువస్తుంది. అలాగే నగరం నడిబొడ్డున 2 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించినట్లయితే.. అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ (UHTC) కు శాశ్వత భవనాన్ని నిర్మాణం చేయడానికి ఎయిమ్స్ బీబీనగర్ సిద్ధంగా ఉందని., ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. 26.07.2024 న డెప్యూటీ డైరెక్టర్, ఎయిమ్స్, బీబీనగర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు లేఖ వ్రాశారు.
కాబట్టి, ఈ విషయంపై మీరు ప్రత్యేకమైన దృష్టిసారించి ఎయిమ్స్ అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ (UHTC) కు శాశ్వత భవన నిర్మాణాన్ని చేపట్టడానికి హైదరాబాద్ నగరంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా 2 ఎకరాల భూమిని ఎయిమ్స్, బీబీనగర్ కు కేటాయించాలని అంతవరకూ తాత్కాలికంగా అందుబాటులో ఉన్న ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించి అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ సేవలను వెంటనే ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకరించాలని కోరుతున్నట్లు కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.