సూరన్ కోట్ ప్రాంతంలో ఇటీవల వాయుసేన కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఉగ్రవాదులు ఏకే అసాల్ట్ రైఫిల్స్‌తో పాటు అమెరికాలో తయారు చేసిన ఎం4 కార్బైన్‌లు, స్టీల్ బుల్లెట్‌లను కూడా ఉపయోగించి గరిష్ఠంగా ప్రాణనష్టం చేసేందుకు ప్రయత్నించినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దాడి అనంతరం ఉగ్రవాదులు పారిపోయి అటవీప్రాంతంలో దాక్కున్నారు. జమ్మూ కశ్మీర్ ఐజీపీ ఆనంద్ జైన్, ఆర్మీ సీనియర్ అధికారులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు షాసితార్, గుర్సాయ్, సనాయ్, షీందారా టాప్ సహా పలు ప్రాంతాల్లో సైన్యం, పోలీసుల గాలింపు చేపట్టారు.
READ MORE: One Nation One Election: ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం..?
ఈ క్రమంలో ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి ఘటనలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు మెరుపుదాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరీ-పూంచ్‌లో ఉగ్రవాద ఘటనలు నిర్వహిస్తున్న అబూ హమ్జా ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు. సైన్యానికి నష్టం కలిగించే లక్ష్యంతో దాడిలు ఉక్కు బుల్లెట్లను ప్రయోగించారు. దాడి ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. అదే సమయంలో ఆదివారం రెండో రోజు సైతం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగింది. 20 కిలోమీటర్ల పరిధిలో ఉగ్రవాదులను చుట్టుముట్టి వారిని గుర్తించే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమయ్యాయి.
వారిని పట్టుకునేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, పారా కమాండోలను సెర్చ్ ఆపరేషన్‌లో మోహరించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దాడికి కారణమైన ఉగ్రవాదులను త్వరలో పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు.