Site icon NTV Telugu

Off The Record: తెలంగాణ సర్కార్‌లో బ్లాక్‌షీప్‌ ఎవరో తెలిసిందా?.. కేబినెట్ చర్చల కీలక సమాచారం బయటికి ?

Congress

Congress

తెలంగాణ సర్కార్‌లో బ్లాక్‌షీప్‌ ఎవరో తెలిసిందా? కేబినెట్‌ రహస్యాలు.. ముఖ్యమైన నిర్ణయాలు ముందే ప్రతిపక్షాలకు ఎలా లీక్‌ అవుతున్నాయో క్లారిటీ వచ్చిందా? సదరు లీకు వీరులు కేబినెట్‌ మంత్రులా? లేక అత్యున్నత అధికారులా? రహస్య సమాచారాన్ని వాళ్ళు ఎక్కడికి పంపుతున్నారో కూడా సర్కార్‌ పెద్దలకు క్లారిటీ వచ్చేసినట్టేనా?

Also Read:Agibot A2 Robot: 106 కి.మీ నాన్‌స్టాప్‌గా నడిచి.. హ్యూమనాయిడ్ రోబో నయా రికార్డ్

తెలంగాణ కేబినెట్‌లో చర్చల సారాంశం అధికారికంగా వెల్లడించడానికంటే ముందే కొందరు ప్రతిపక్ష నాయకులకు చేరుతోందట. అంతకు మించి కాన్ఫిడెన్షియల్‌ అనుకున్న వివరాలు కూడా బయటికి వెళ్తుండటం ప్రభుత్వ పెద్దల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో అసలు మనం చెప్పడానికంటే ముందే వివరాలు బయటికి ఎలా వెళ్తున్నాయన్న అంశం మీద ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సాధారణంగా మంత్రివర్గ సమావేశంలో కేబినెట్‌ మినిస్టర్స్‌, అలాగే అజెండాలో ఉన్న శాఖలకు చెందిన ఉన్నతాధికారులే ఉంటారు. అలాంటిది మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుకున్న ప్రతి మాట, పూర్తి సమాచారం… పిన్ టు పిన్ బయటకు వెళ్తున్నాయట. దాంతో… అధికారులు సమాచారం చేరవేస్తున్నారా..? లేదంటే మంత్రుల్లో ఎవరైనా కోవర్టీజన్ చేస్తున్నారా..?

అన్న చర్చ జరుగుతోంది ప్రభుత్వ వర్గాల్లో. అదే సమయంలో…ఒకవేళ ఒకరిద్దరు మంత్రులు కాస్త తేడాగా ఉన్నా…అంత ధైర్యం చేస్తారా..! వాళ్ళు చేసినా ప్రభుత్వ పెద్దలు చూస్తూ ఊరుకుంటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో వేళ్ళన్నీ ఉన్నతాధికారులవైపు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పాత వాసనలు పోని, అత్యుత్సాహం ప్రదర్శించే అధికారుల ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్‌లోని పరిశ్రమల భూముల కన్వర్షన్‌కు సంబంధించి కీలకమైన ల్యాండ్ పాలసీ తీసుకువచ్చింది. ఇది కేబినెట్‌లో చర్చించిన అంశం. దీని కోసం కేబినెట్ సబ్ కమిటీని వేసి…. ఆ నివేదిక ప్రకారం ఓ విధానాన్ని రూపొందించింది. ఐతే.. అందుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉత్తర్వులు రాకముందే.. విషయం అంతా ప్రతిపక్ష పార్టీలకు చేరిపోయింది.

దాని ఆధారంగా సర్కార్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు విపక్ష నాయకులు. పాలసీ రూపకల్పనలో ప్రభుత్వం ఉద్దేశ్యం ఒకటైతే…. దాన్ని విస్మరించి ప్రతిపక్షం వ్యవహారం మొత్తాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వం పై దండయాత్రకు దిగింది. పైగా… కేబినెట్‌ మీటింగ్‌లో చర్చించిన వెంటనే వివరాలు పూర్తిస్థాయిలో బయటికి రావడంతో సర్కార్‌ ముఖ్యులు షాకయ్యారట. అలాగే…. అంతకు మించి అసలు కేబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వకముందే…సమాచారం అంతా లీకైంది. దాంతో ఆ లీకు వీరులు ఎవరనే దానిపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు కనిపించింది. మేటర్‌ సీరియస్‌ అని, విచారణ జరుపుతామని మంత్రి శ్రీధర్ బాబు డైరెక్ట్‌గానే చెప్పేశారు. అలా.. మంత్రి ప్రకటన తర్వాత అంతా అలర్ట్‌ మోడ్‌లోకి వచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు.

ఆ తర్వాతే ప్రభుత్వంలో అంతర్గతంగా జరిగే వ్యవహారాలను బయటకు చేరవేసింది ఎవరన్న చర్చలు గట్టిగా జరుగుతున్నాయి. కేబినెట్‌ మంత్రులు సమాచారాన్ని బయటకు ఇచ్చారా..? లేదంటే అధికారులు ఇచ్చారా అనే అనుమానాల నడుమ రెండో కేటగిరీవైపే అనుమానపు చూపులు పెరుగుతున్నాయట. ప్రత్యేకించి ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ పాలసీ సమాచారం మొత్తం పరిశ్రమల శాఖ అధికారుల నుంచే లీక్ అయ్యిందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బాగా దగ్గరగా ఉన్న అధికారులే ఈ పని చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ వాళ్ళు పాత స్వామి భక్తితో లీక్ చేసినా…అవతలి వాళ్ళకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా.. ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టారన్న అభిప్రాయం సైతం ఉందట. గతంలో కూడా అధికారుల నుంచే ఇలాంటి లీకులు వచ్చాయన్న చర్చలు నడుస్తున్నాయి.

Also Read:Awantipora Operation: భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం.. ఒకరి అరెస్ట్

మంత్రి శ్రీధర్‌బాబు చెప్పినట్టు పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపి దోషుల్ని తేల్చినా… వివరాలు మాత్రం బయటకు చెప్పే అవకాశం లేదు. కానీ… వాళ్ళు ఎవరో ప్రభుత్వానికి తెలిసిపోయింది కాబట్టి పద్ధతి మార్చుకోమని వార్నింగ్స్‌ ఇవ్వడం, మీటింగ్స్‌ జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి ఉండవచ్చంటున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో కూడా అందరూ సీనియర్ మంత్రులే కావడంతో అక్కడ నుండి లీక్ అయ్యే అవకాశం కూడా లేదని, వోవరాల్‌గా అధికార వర్గాల నుంచే కీలక సమాచారం ప్రతిపక్షాలకు వెళ్తోందన్నది క్లియర్‌ అన్నది సెక్రటేరియెట్‌ టాక్‌.

Exit mobile version