NTV Telugu Site icon

TTD: శ్రీవాణి ట్రస్ట్ రద్దు.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

Tirumala

Tirumala

TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి ఆ స్కీంను మాత్రం కొనసాగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లను తిరిగి ప్రభుత్వ బ్యాంకులోకి మళ్లిస్తామని తెలిపింది. శ్రీవారి భక్తులకు రెండు మూడు గంటల సమయంలోనే దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. అన్యమతస్థ ఉద్యోగులను ప్రభుత్వ శాఖలోకి బదిలీ చేస్తామన్నారు. తిరుమలలో ఉన్న వ్యర్థపదార్థాలను రెండు మూడు నెలల కాలంలో తరలిస్తామని చెప్పారు. తిరుపతిలో ఉన్న ప్లై ఓవర్‌కి తిరిగి గరుడ వారధిగా నామకరణం చేశామన్నారు.

Read Also: Andhra Pradesh: ఇక‌పై ఎంత‌మంది పిల్లలున్నా పోటీకి అర్హులే..

అలిపిరి వద్ద టూరిజం శాఖకు కేటాయించిన 20 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ముంతాజ్ హోటల్‌ని నిలిపివేసి ఆ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై ఆంక్షలు విధించామన్నారు. స్థానికులకు గతంలో లాగానే మొదటి మంగళవారం దర్శనం కల్పించే విధానాన్ని పున:రుద్దరణ చేస్తామన్నారు. అన్నప్రసాదంలో భక్తులకు అందించే మెనూలో అదనంగా కొన్ని పదార్థాలు చేరుస్తామన్నారు. లడ్డు ప్రసాదంలో వినియోగించే పదార్థాల నాణ్యత పెంపుకి నిపుణులు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మోత్సవం బహుమానంగా ఉద్యోగులకు రూ.15,400 అందిస్తామన్నారు. శారదా పీఠంకు కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకుంటుందన్నారు. టూరిజం శాఖకు కేటాయించే టిక్కెట్ల విధానాన్ని రద్దు చేశామన్నారు.