Mechanical Elephant: కేరళలో మొట్టమొదటిసారిగా ఆచారాలను నిర్వహించేందుకు యాంత్రికమైన ఏనుగును ఓ ఆలయంలోని దేవునికి అంకితం చేశారు. ఆ రోబోటిక్ ఏనుగును రోజువారీ ఆచారాలను నిర్వహించడం కోసం వినియోగించనున్నారు. కేరళలో గల త్రిసూర్‌లోని శ్రీకృష్ణ ఆలయంలో రోబో ఏనుగును ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏనుగు అచ్చం నిజం ఏనుగులాగే ఉంటుంది. కేరళలో ఇలాంటి రోబో ఏనుగును కలిగివున్న ఆలయం ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ రోబో ఏనుగుకు ‘ఇరింజదపల్లి రామన్’ అని నామకరణం చేశారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారు. దీని బరువు 800 కిలోలు. జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’కు చెందిన కొందరు ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి బహూకరించారు.
ఆలయ వంశపారంపర్య అర్చకుడు రాజ్ కుమార్ నంబూద్రి ఈ రోబో ఏనుగు గురించి చెబుతూ, ఇది నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందని వివరించారు. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని వెల్లడించారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. దీనిపై ఆలయ అధికారులు స్పందిస్తూ, సాధారణ ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, వాటితో కొన్నిరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని వివరించారు. ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో, ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని తెలిపారు. ఇతర దేవాలయాలు కూడా ఇదే బాటలో నడవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Read Also: PM-KISAN: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు
రామన్ ఆలయంలో సురక్షితమైన, క్రూరత్వం లేని పద్ధతిలో వేడుకలు నిర్వహించడంలో సహాయపడుతుందని, తద్వారా నిజమైన ఏనుగుల పునరావాసం, అడవులలో నివసించడం, వాటికి బందిఖానా భయానకతను అంతం చేయడంలో రామన్ సహాయం చేస్తుందని పెటా తెలిపింది. పెరువనం సతీశన్ మరార్ నేతృత్వంలోని పెర్కషన్ బృందం ప్రదర్శనతో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కేరళతో సహా దేశంలో చెరలో ఉన్న చాలా ఏనుగులను అక్రమంగా పట్టుకున్నారని లేదా అనుమతి లేకుండా వేరే రాష్ట్రానికి తరలించారని పెటా పేర్కొంది. ఏనుగులను ఉపయోగించే అన్ని వేదికలు, ఈవెంట్‌లు నిజమైన ఏనుగుల స్థానంలో యాంత్రిక ఏనుగులు లేదా ఇతర మార్గాలకు మారాలని పెటా కోరింది. ఇప్పటికే నిర్బంధంలో ఉన్న ఏనుగులను అభయారణ్యాల్లో వదిలిపెట్టాలనిపిలుపునిచ్చింది. అడవుల్లో అయితే ఆ ఏనుగులు బంధించబడకుండా, ఇతర ఏనుగుల సహవాసంలో జీవించవచ్చు.