NTV Telugu Site icon

Kerala: కేరళ ఆర్థిక సంక్షోభం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు

Kerala Crisis

Kerala Crisis

కేరళ ఆర్థిక సంక్షోభానికి కారణం మీరంటే మీరేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే కారణమని.. ప్రభుత్వం వృథా ఖర్చులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణమని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ స్పందిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం విడుదల చేయని నిధులకు సంబంధించి సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌ ఎప్పుడూ వేర్వేరుగా లెక్కలు చెబుతున్నారని మురళీధరన్‌ పేర్కొన్నారు.

Read Also: UP: రైలు ఇంజిన్‌లో మృతదేహం.. కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ట్రైన్

ఆర్థిక విషయాల్లో కేరళతో పాటు ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ చేసిన ప్రకటనపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి స్పందించారు. కేరళ సీఎం దేశ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా అవగాహన కలిగి ఉండాలని మురళీధరన్ చెప్పారు. కేరళ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగిన మురళీధరన్.. సంక్షేమ పింఛన్లలో కేంద్రం వాటాతో సహా పలు కేటాయింపులు, గ్రాంట్లు ఇప్పటికే కేరళకు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంటే తదుపరి విడత సంక్షేమ పింఛన్‌ కోసం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
మూలధన పెట్టుబడుల కోసం రూ.1,925 కోట్లు.. రాష్ట్రం తప్పనిసరి సమ్మతి నివేదికను సమర్పించనందున ఇవ్వలేదని మురళీధరన్ తెలిపారు. కాగ్ నివేదిక ప్రకారం.. కేరళ రూ. 7,000 కోట్లకు పైగా పన్నులు వసూలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

Read Also: Mrunal Thakur: సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో..

అంతకుముందు.. కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఆర్థిక విషయాల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని బాలగోపాల్ అన్నారు. ఈ వివక్షతో కేరళ ఎక్కువగా నష్టపోతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపరమైన పరిష్కారాలను ఆలోచించాలని తెలిపారు.