1 Dead and 20 Injured in Bamb Blasts At Kerala: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరిలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో అక్కడ దాదాపుగా 2 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం దీన్ని ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తోంది. ఉదయం 9 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో క్రిస్టియన్ ప్రేయర్ మీట్ ‘యాహోవా సాక్షి’ కార్యక్రమం శుక్రవారం నుంచి జరుగుతోంది. ఈ కార్యక్రమంకు చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఆదివారం ఉదయం 9.20కి ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై హాలు నుంచి బయటకు పరుగులు తీశారు.
కన్వెన్షన్ సెంటర్ పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా గాయాలు అవ్వగా.. అందులో 5 మంది పరిస్థితి విషమంఆ ఉంది. తీవ్రమైన గాయాలతో వున్న క్షత్రగాత్రులను కొచ్చి మెడికల్ కాలేజీ నుంచి కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలిస్తున్నారు. గాయపడిన వారిలో పిల్లలు మరియు వృద్ధులు ఉన్నారు. మంటలార్పడానికి ఫిర్ సిబ్బంది బాగా కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఈ పేలుళ్లకు కారణం ఇంకా తెలియరాలేదు. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది.