Karnataka CM: ఎట్టకేలకు కర్ణాటక సీఎం పీఠముడి వీడింది. సీఎంగా సిద్దరామయ్య నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30కి ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యతోపాటు సీఎం పదవికి పోటీ పడ్డ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు సిద్ధరామయ్య, శివకుమార్ ఢిల్లీకి చేరుకుని కొత్త మంత్రివర్గంలో చేర్చుకోవాల్సిన ఎమ్మెల్యేల పేర్లు, వారికి కేటాయించాల్సిన శాఖలపై హైకమాండ్ తో చర్చించారు. సిద్ధూ ప్రమాణస్వీకారం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం దిగిరానుంది. సోనియా, రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సూర్జేవాలా సహా పార్టీ అగ్రనాయకులంతా బెంగళూరుకు విచ్చేయనున్నారు.
Read Also:Orange Movie: పవన్ కల్యాణ్ కు రూ.కోటి ఇచ్చిన నాగబాబు.. ఎందుకంటే ?
అంతే కాకుండా కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్, బిహార్ సీఎం నీతీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీకు ఆహ్వానాలు అందినప్పటికీ హాజరుకావడం లేదని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల సీఎంలతోపాటు వివిధ పార్టీ లీడర్లు పట్టాభిషేకానికి హాజరుకానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్‌పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, బిహార్ డిప్యూటీసీఎం తేజస్వీయాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్బుల్లా హాజరుకానున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను డీకే శివకుమార్ దగ్గరుండి పరిశీలించారు. పోలీసులు అధికారులు, ఇతర యంత్రాంగంతో మాట్లాడి సూచనలు సలహాలు ఇచ్చారు. భారీగా జనం కూడా వచ్చే ఛాన్స్ ఉన్నందున ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు హితవు పలికారు. 2013లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన సిద్ధరామయ్య రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read Also:PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు