Siddaramaiah: తుంగభద్ర గేటు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు పూర్తిగా వృథాకాక ముందే స్టాప్‌లాగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు. మొదట డ్యామ్ క్రస్టు స్థాయి 1613 అడుగుల వరకు నీటిని వదిలేసి.. ఆ తర్వాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం అలా కాకుండా క్రస్టు స్థాయి కన్నా ఎగువకు నీళ్లు ఉన్న సమయంలోనే స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇలా చేస్తే నీటిని పూర్తిగా వృథా కాకుండా చూడొచ్చని అంటున్నారు. ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన సమయం నుంచి సోమవారం రాత్రి 9 గంటల వరకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో జలాశయంలోకి సగటున 25, 571 క్యూసెక్కుల నీరు వస్తోంది. 19 గేట్ల నుంచి 99,567 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Read Also: ACB Raids: మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
నేడు హోస్పేటలో తుంగభద్ర డ్యాంను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పరిశీలించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19 గేటు కొట్టుకుపోవడంతో ఆయన పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 11.50 కి కొప్పలకు కర్ణాటక సీఎం చేరుకోనున్నారు. కొప్పల నుంచి రోడ్డు మార్గంలో 12.15కి తుంగభద్ర ప్రాజెక్టు చేరుకోనున్నారు సీఎం సిద్ధరామయ్య. తుంగభద్ర ప్రాజెక్టును పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో కర్ణాటక సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తుంగభద్ర జలాశయం నుంచి కొప్పలకు రోడ్డు మార్గంలో వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరు వెళ్లనున్నారు సీఎం సిద్ధరామయ్య. మరో వైపు ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌లు కూడా డ్యామ్‌ను పరిశీలించనున్నారు. స్థానిక డ్యాం, ఇరిగేషన్ అధికారులతో భేటీ కానున్నారు.