కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఆ రాష్ట్ర హైకోర్టు (Karnataka High Court) ఝలక్ ఇచ్చింది. ఓ కేసులో ఆయనకు రూ.10 వేలు జరిమానా విధించింది. 2022లో నిరసనలకు దిగి రోడ్లు దిగ్బంధం చేసిన కేసులో ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ఈ కేసులో మార్చి 6న ప్రజాప్రతినిధుల కోర్టు ముందు హాజరుకావాలని సిద్ధరామయ్యకు న్యాయస్థానం ఆదేశించింది.
సీఎం సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, మంత్రులు ఎంబీ పాటిలవ్, రామలింగారెడ్డికి కూడా కోర్టు రూ.10 వేలు జరిమానా వేసింది. రామలింగారెడ్డిని మార్చి 7న, సూర్జేవాలాను మార్చి 11న, ఎంబీ పాటిల్‌ను మార్చి 15న ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో అప్పటి మంత్రి కేఎస్ ఈశ్వరప్పను అరెస్టు చేయాలంటూ సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నివాసాన్ని దిగ్బంధించేందుకు ప్రదర్శన నిర్వహించారనే కారణంతో కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ సిద్ధరామయ్య హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలిచ్చింది.