DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత

  • కర్ణాటకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం
  • ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణం
  • 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం
  • మహిళలకు చోటు లేకపోవడంపై విమర్శలు
Dksihavakumar

Dksihavakumar

కర్ణాటకలో బుధవారం డీకే.శివకుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. డీకే.శివకుమార్‌ ముఖ్యమంత్రిగా.. ఆయనతో పాటు 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. డీకే.శివకుమార్ అయితే ముఖ్యమంత్రి అయ్యారు గానీ.. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కకపోవడంపై ప్రస్తుతం రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుల సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్‌ను రూపొందించినప్పటికీ.. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం.. దేశంలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యంపై మరోసారి చర్చకు దారితీసింది. శాసనసభల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అధికార కేంద్రాల్లో వారికి తగిన స్థానం దక్కడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి?


ఇటీవల ఏర్పడిన పలు రాష్ట్ర ప్రభుత్వాల్లో మహిళలకు కనీసం కొంత మేర ప్రాతినిధ్యం కల్పించారు. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వంలో 35 మంది మంత్రుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో 23 మంది మంత్రుల్లో నలుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు. కేరళలో ముఖ్యమంత్రి సతీశన్ కేబినెట్‌లో 20 మంది మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అసోంలో ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు మంత్రుల్లో ఒకరు మహిళ ఉన్నారు. కర్ణాటకలో 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తే ఒక్క మహిళ కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

×
×
Ad

కర్ణాటకలో 224 మంది సభ్యుల్లో అసెంబ్లీలో కేవలం 10 మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కొత్త కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో లింగ సమానత్వంపై మరోసారి చర్చ మొదలైంది. రాజకీయ పార్టీల నిర్ణయాత్మక స్థానాల్లో మహిళలకు మరింత అవకాశాలు కల్పించాలని మహిళా సంఘాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.