టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ సంతాప సభగా మారింది. పామూరు రోడ్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో.. సభలో గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా పలువురు తీవ్రంగా గాయపడటంతో హుటాహుటివారిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు. అయితే తాజాగా ఈ ఘటనపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అధికార దాహం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు. ఎక్కువ మందిని చూపించడానికి కందుకూరులో సభ పెట్టారని ఆయన విమర్శించారు.
Also Read : Heeraben Modi: కోలుకుంటున్న ప్రధాని మోదీ తల్లి.. ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్
ఎన్ని పొరపాట్లు చేయకూడదో చంద్రబాబు అన్ని చేశారని, 8 మందిని చంద్రబాబు పొట్టనపెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. సభకు వస్తే కూలీ ఇస్తారని వచ్చినవాళ్లు చనిపోయారని, డ్రోన్ షాట్ల కోసం బలవంతంగా తరలించిన జనంతో చంద్రబాబు సభ పెట్టారన్నారు. రెండు పక్కల ఫ్లెక్సీలు పెట్టి మధ్యలోకి జనాన్ని తోలారని, ఇవి చంద్రబాబు చేసిన హత్యలే చంద్రబాబుపై కేసు పెట్టాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబే ఖర్మ అన్న కాకాణి.. చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడమే ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ సభలకు అంత మంది వచ్చినా ఎక్కడా ఒక అపశృతి జరగలేదని, ఇంకా ఒకసారి అవకాశం ఇవ్వాలని అంటేనే చంద్రబాబు ఎంత దిగజారిపోయారో అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 8మంది కుటుంబాలు వీధిన పడ్డాయని, చంద్రబాబు ఏం చేశారని జనం వస్తారు?.. గతంలో పుష్కరాల సమయంలోనూ 29మంది మృతికి కారణమయ్యారు అని మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.