Kaikala Satyanarayana: మహానటులు యన్టీఆర్, యస్వీఆర్ అనితరసాధ్యంగా పోషించిన రావణ, దుర్యోధన, యమధర్మరాజు పాత్రలను సత్యనారాయణ సైతం పోషించి అలరించారు. యస్వీరంగారావు “ఇంద్రజిత్, సంపూర్ణ రామాయణం“ వంటి చిత్రాలలో రావణాసురునిగా అభినయించి ఆకట్టుకున్నారు. ఇక రామారావు “భూకైలాస్, సీతారామకళ్యాణం, శ్రీకృష్ణసత్య, శ్రీరామపట్టాభిషేకం, బ్రహ్మర్షి విశ్వామిత్ర“ చిత్రాలలో రావణబ్రహ్మగా అనితరసాధ్యంగా నటించారు. వారి తరువాత అదే రావణ పాత్రలో సత్యనారాయణ “సీతాకళ్యాణం, సీతారామవనవాసము“ చిత్రాలలో నటించి మెప్పించారు. ఇక `పాండవవనవాసము`లో యస్వీ రంగారావు దుర్యోధనునిగా ఒప్పించారు. యన్టీఆర్ “శ్రీక్రిష్ణ పాండవీయము, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వము“ చిత్రాలలో దుర్యోధనునిగా తనకు తానే సాటిగా అలరించారు. ఇదే పాత్రను సత్యనారాయణ “శ్రీకృష్ణావతారం, కురుక్షేత్రం“ చిత్రాలలో పోషించారు.
Read Also: Kaikala Satyanarayana: స్టార్స్ తో సత్యనారాయణ చిత్రాలు!
ఇక యస్వీ రంగారావు యమధర్మరాజుగా ఎస్.వరలక్ష్మి సావిత్రిగా నటించిన `సతీసావిత్రి`లో నటించారు. యన్టీఆర్ అదే పాత్రను వాణిశ్రీ సావిత్రి పాత్రలో కనిపించిన `సతీసావిత్రి`లో అభినయించారు. యమధర్మరాజుగా సత్యనారాయణ సోషియో ఫాంటసీ `యమగోల`లో తొలిసారి నటించారు. ఆ తరువాత “యమలీల, యమగోల మళ్ళీ మొదలైంది“ చిత్రాలలోనూ యమధర్మరాజు పాత్రలో ఆకట్టుకున్నారు. ఇద్దరు మేరునగసమానులైన మహానటులు అనితరసాధ్యంగా అభినయించిన పాత్రలను పోషించి, ఒప్పించడం అంటే మాటలు కాదు. కానీ, సత్యనారాయణ తాను ఎంతగానో అభిమానించే యన్టీఆర్, యస్వీఆర్ పోషించిన విలక్షణమైన పాత్రలను సైతం ధరించి ఆకట్టుకోవడం విశేషం!