NTV Telugu Site icon

Justice NV Ramana: ఆర్థిక పరిస్థితిని గమనించి ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి..

Justice Nv Ramana

Justice Nv Ramana

Justice NV Ramana: కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నా, అప్పటి గాయాలు చాలా మందిని ఇంకా వెంటాడుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొవిడ్‌ వచ్చినప్పుడు చాలా మంది బతకాలనే ఆశతో ఆస్తులను అమ్మి వైద్యం చేయించుకున్నారని, కానీ ఆర్థికంగా అన్నీ కోల్పోయి ఇంకా ఎందుకు బతికున్నామా అని ఇప్పుడు కుమిలిపోతున్నారని ఆయన అన్నారు. ప్రాణం మీదకొస్తే తల తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడతారని, అలాంటి వారి ఆర్థిక పరిస్థితిని గమనించి ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని వైద్యులకు జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం బేగంపేటలోని హోటల్‌ మారిగోల్డ్‌లో ‘డయాబెటిస్‌ అండ్‌ యూ సొసైటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై.. వైద్యరంగంలో ఉత్తమ సేవలందించిన పలువురు వైద్యులకు ఆయన అవార్డులను అందజేశారు.

Read Also: Indian Army: ఆర్మీలో రిక్రూట్‌మెంట్‌ కోసం కొత్త బోర్డులు.. అధికారుల కొరతకు చెక్‌!

ఈ కాలంలో జనాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధుల గురించి ఆయన మాట్లాడారు. దేశాన్ని జీవనశైలి వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని, దేశంలో 1.25 కోట్ల మంది చిన్నారులు, 4.40 కోట్ల మంది మహిళలు ఊబకాయంసమస్యతో బాధపడుతున్నారని ఇటీవల ఓ ఆసుపత్రి నిర్వహించిన సర్వేలో తేలిందని చెప్పుకొచ్చారు. అల్లోపతి లాంటి ఆధునిక వైద్య విధానాలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ఎంతోమంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాలను ప్రభుత్వాలు అరికట్టాలన్నారు. దేశంలో కొంత మంది వైద్యులు సమాజం కోసం కృషి చేస్తున్నారని.. నగరానికి చెందిన వైద్యురాలు షీలా భోలే ఇదే కోవకు చెందుతారని అన్నారు. 88 ఏళ్ల వయసులోనూ వయోభారాన్ని లెక్క చేయకుండా ఇప్పటికీ స్వచ్ఛందంగా వైద్య సేవలందిస్తున్నారని ప్రశంసించారు. “డయాబెటిస్‌ అండ్‌ యూ(డీఏవై’) సొసైటీ” వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ వసంత్‌ కుమార్‌ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని, ఎంతోమంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారని కొనియాడారు.

సమాజాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దే వైద్యులు బాధ్యతాయుతంగా సేవలందించాలని జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. ‘దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా.. ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్‌.. గట్టి మేలు తలపెట్టవోయ్‌.. తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ గలవాడే మనిషోయ్‌..’ అన్న మహాకవి గురజాడ మాటలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొ్న్నారు.