Justice Chandrachud: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సీజేఐగా నియామకమైన జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయన భారత న్యాయవ్యవస్థకు 50వ అధిపతిగా నియమితులయ్యారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో లాంఛనంగా ఈ కార్యక్రమం జరగనుంది. 44 ఏళ్ల క్రితం ఆయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేయగా.. ఇప్పుడు తనయుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ అత్యున్నత పీఠాన్ని అధిరోహించనున్నారు. జస్టిస్ వైవి చంద్రచూడ్ ఫిబ్రవరి 22, 1978 నుంచి జూలై 11, 1985 వరకు సీజేఐగా తమ అత్యుత్తమ సేవలను అందించారు.
ఇవాళ ఉదయం 10 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 10, 2024 వరకు రెండేళ్లపాటు సీజేఐగా వ్యవహరిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. అక్టోబరు 11న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ తన వారసుడిగా జస్టిస్ చంద్రచూడ్‌ను సూచించగా.. ఆయన అనంతరం జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా నియామకమయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను అక్టోబర్ 17న తదుపరి సీజేఐగా నియమించారు. నవంబర్ 11, 1959న జన్మించిన జస్టిస్ చంద్రచూడ్, మే 13, 2016న అత్యున్నత న్యాయస్థానానికి పదోన్నతి పొందారు. అయోధ్య భూవివాదం, గోప్యత హక్కు, వ్యభిచారానికి సంబంధించిన విషయాలతో సహా అనేక రాజ్యాంగ బెంచ్‌లు, అత్యున్నత న్యాయస్థానం మైలురాయి తీర్పులలో ఆయన భాగమయ్యారు.
Earthquake: అర్ధరాత్రి నేపాల్, ఢిల్లీని వణికించిన భూకంపం.. ఆరుగురు మృతి
ఐపీసీలోని సెక్షన్ 377, ఆధార్ పథకం చెల్లుబాటు, శబరిమల సమస్యను పాక్షికంగా కొట్టివేసిన తర్వాత స్వలింగ సంబంధాలను నేరరహితం చేయడంపై సంచలనాత్మక తీర్పులను వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ చంద్రచూడ్ కూడా భాగం. ఇటీవల అతని నేతృత్వంలోని బెంచ్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం పరిధిని 20-24 వారాల గర్భస్రావం కోసం అవివాహిత స్త్రీలను చేర్చడానికి సంబంధిత నిబంధనలను విస్తరించింది.కొవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడానికి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అనేక ఆదేశాలు జారీ చేసింది, గత సంవత్సరం కరోనా మహమ్మారి రెండో వేవ్‌ను జాతీయ సంక్షోభంగా పేర్కొంది. ఇటీవల అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తుల నియామకంపై సభ్యుల అభిప్రాయాలను సేకరించేందుకు అవలంభించిన సర్క్యులేషన్ పద్ధతిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కొలీజియం ఇద్దరు న్యాయమూర్తులలో ఆయన కూడా ఉన్నారు. ఆయన మార్చి 29, 2000 నుంచి అక్టోబర్ 31, 2013న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ జూన్ 1998లో బాంబే హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. అదే సంవత్సరంలో ఆయన న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు అదనపు సొలిసిటర్ జనరల్ అయ్యారు.
న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో ఆనర్స్‌తో బీఏ పూర్తి చేసిన తర్వాత, జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. యూఎస్‌ఏలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ, జురిడికల్ సైన్సెస్ (SJD)లో డాక్టరేట్ పొందారు. ఆయన సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ముంబై విశ్వవిద్యాలయంలో, అమెరికాలోని ఒక్లహామా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ చంద్రచూడ్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. న్యాయమూర్తుల ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ కేసులను పరిష్కరించడం వంటివి ప్రధానంగా ఉన్నాయి.