Jogu Ramanna : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుమారు 50 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే ను నిర్వహించింది. ఈ సర్వేను ప్లానింగ్ కమిషన్ఆ ధ్వర్యంలో రూపొందించి, ఆ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడంతో పాటు, అసెంబ్లీ సైతం ఆమోదం తెలిపింది. ఫలితంగా, ఈ నివేదిక అధికారికంగా అమలులోకి వచ్చింది. అయితే, ఈ కుల గణన సర్వే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సర్వేలో “ముస్లిం బీసీలు ” అనే పదాన్ని వాడడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వివిధ కుల సంఘాలు ఈ నివేదికపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, బీసీలను తగ్గించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న కుల గణన సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జోగు రామన్న మాట్లాడుతూ, ఈ సర్వే నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని, బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆక్షేపించారు. బీసీల హక్కులను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. బీసీలను రాజకీయంగా, సామాజికంగా బలహీనపరిచేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
2014లో ఓసీల (OCs) జనాభా 7 శాతం మాత్రమే ఉండగా, ప్రస్తుతం అదే జనాభాను 15.79 శాతంగా చూపించడం బీసీలను అణచివేసే కుట్రలో భాగమని జోగు రామన్న ఆరోపించారు. ప్రభుత్వం బీసీలను గణనీయంగా తగ్గించి చూపిస్తూ, వారి ప్రాధాన్యతను తక్కువ చేయాలని చూస్తోందని ఆరోపించారు.
Off The Record : కొడుకుల పంచాయతీతో తండ్రుల మధ్య దూరం?
కుల గణన సర్వేలో జరిగిన అన్యాయాన్ని బీసీలు సహించబోరని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల అసమాన శక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం చూసేలా చేస్తామని జోగు రామన్న హెచ్చరించారు. బీసీలపై జరుగుతున్న మోసానికి గట్టి పోరాటం చేయాలని, ఈ విషయంలో ఏకతాటిపై రావాలని ఆయన బీసీ నాయకులను, కుల సంఘాలను, ప్రజలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలన బీసీలను ప్రోత్సహించేందుకు కాదని, వారిని అణగదొక్కేందుకు చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. కుల గణన నివేదికలో ఉన్న తప్పుడు గణాంకాలను సవాలు చేయాలని, దీనిపై ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని బీసీలను ఉద్దేశించి జోగు రామన్న పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ, బీసీలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీల సంఖ్య తగ్గించేందుకు ఏ రాజకీయ కుట్ర జరుగుతోందో వివరిస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీసీలకు పిలుపునిచ్చారు. ఈ వివాదం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకుంటే బీఆర్ఎస్ భవిష్యత్తులో దీని గురించి మళ్లీ ఉద్యమానికి దిగుతుందని జోగు రామన్న హెచ్చరించారు.
Diabetes Symptoms : ఈ లక్షణాలు మీలో ఉంటే.. షుగర్ వ్యాధి బారిన పడ్డట్టే.. ఇప్పుడే చెక్ చేసుకోండి..