ఝార్ఖండ్ (Jharkhand) సంక్షోభానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు చంపయ్ సోరెన్ (Champai Soren) సీఎంగా ప్రమాణం చేశారు. హేమంత్ సోరెన్ (Hemant Soren) అరెస్ట్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర సందిగ్ధం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్‌ను 43 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు మద్దతుతో కూడిన లేఖను గవర్నర్ రాధాకృష్ణన్‌కు అందజేశారు. ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసినా కొన్ని గంటల పాటు గవర్నర్ హోల్డ్‌లో పెట్టారు. దీంతో రాజ్‌భవన్ వేదికగా ఏదో కుట్ర జరుగుతోందని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అనుమానించింది. మొత్తానికి గురువారం అర్ధరాత్రి గవర్నర్.. చంపయ్‌ను ప్రమాణస్వీకారానికి పిలిచారు. ఇక శుక్రవారం ఉదయం చంపయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ 10 రోజులే సమయం విధించారు. దీంతో మరోసారి కూటమిలో భయాందోళన మొదలైంది. ఈ మధ్యలో ఏదైనా జరగొచ్చన్న సందేహంతో జేఎంఎం క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది.
హైదరాబాద్‌కు షిఫ్ట్..
ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 41 ఎమ్మెల్యేల బలం ఉంటే చాలు. సంకీర్ణ ప్రభుత్వానికి 43 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు బీజేపీకి (BJP) కూడా 35 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కొంత మంది ఎమ్మెల్యేలను పువ్వుపార్టీ లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు 43 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు (Hyderabad) తరలిస్తున్నారు. గురువారమే తరలించాలని చూసినా పొగమంచు కారణంగా విమాన ప్రయాణానికి అంతరాయం కలిగి ఆగిపోయారు. శుక్రవారం మాత్రం రెండు ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష వరకూ ఎమ్మెల్యేలంతా ఇక్కడే మకాం వేయనున్నారు.
హైదరాబాద్‌కే ఎందుకు?
ఝార్ఖండ్‌కు చెందిన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన 43 మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేలు భద్రంగా ఉండాలంటే హైదరాబాదే సేఫ్ అని ఏఐసీసీ భావించింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేస్తున్నారు. 10 రోజుల పాటు ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు.
బలబలాలు ఇలా..
ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక బీజేపీకి 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇంకో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని.. వారితో బేరసారాలు నడుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.