Jharkhand Spinner Shahbaz Nadeem Retirement: టీమిండియా క్రికెటర్ షాబాజ్ నదీమ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కూడా తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. టీమిండియాకు ఆడే దారులు మూసుకుపోవడంతోనే తాను ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు నదీమ్ తెలిపాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. 34 ఏళ్ల నదీమ్ 2019-2021 మధ్యలో భారత్ తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
‘భారత జట్టులో ఇక నాకు చోటు దక్కదని అర్థమైంది. ఇప్పుడు నేను సెలక్టర్ల ప్రణాళికల్లో లేను. ఎంతో మంది యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. భారత్ తరఫున ఆడే అవకాశముంటే కచ్చితంగా కొనసాగేవాడిని. కానీ సమీప భవిష్యత్తులో ఆ అవకాశం లేదు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగుల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నా’ అని షాబాజ్ నదీమ్ పేర్కొన్నాడు.
జార్ఖండ్ స్టార్ స్పిన్నర్‌గా షాబాజ్ నదీమ్‌కు మంచి పేరుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 140 మ్యాచ్‌లు ఆడి.. 542 వికెట్లు పడగొట్టాడు. 28 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. జార్ఖండ్ తరఫున రంజీల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నదీమ్ కొనసాగుతున్నాడు. 2015-16, 2016-17 రంజీ సీజన్లలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నదీమ్ నిలిచాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. ఈ ఫార్మాట్‌లో 134 మ్యాచ్‌లు ఆడి 175 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాల రికార్డు 8/10. ఇక ఐపీఎల్‌లో 72 మ్యాచ్‌ల్లో 48 వికెట్లు పడగొట్టాడు. 2022 నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్నాడు.