ఝార్ఖండ్‌లో మరో రాజకీయ సంక్షోభం తలెత్తబోతుందా? రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? లేదంటే అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కమలం వ్యూహం పన్నుతుందా? రాజ్‌భవన్ కేంద్రంగా అసలేం జరుగుతోంది. 18 గంటలు గడుస్తున్నా.. గవర్నర్ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. దీంతో ఏదో కుట్ర జరుగుతోందని సంకీర్ణ ప్రభుత్వం భావిస్తోంది.
గురువారం ఉదయం నుంచీ పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్‌పై దేశ ప్రజల దృష్టి మళ్లింది. ఇప్పుడు మీడియా దృష్టంతా ఝారండ్ వైపు మళ్లింది. బుధవారం సాయంత్రం హేమంత్ సోరెన్ రాజీనామా చేయడం.. వెను వెంటనే ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేయడం దాదాపు 18 గంటలు గడిచిపోయింది. పైగా కూటమి సభ్యులంతా జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపయ్ సోరెన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ రాధాకృష్ణన్‌కు తెలియజేశారు. చంపయ్‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరి 18 గంటలు గడుస్తోంది. కానీ అటు వైపు నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో కూటమి సభ్యులంతా ఏదో కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం చీలకుండా ఉండేందుకు జేఎంఎం క్యాంప్ రాజకీయానికి తెరలేపింది. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలనందరినీ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం జేఎంఎంకు లేదని బీజేపీ అంటోంది. కూటమిలోని కొందరు ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌లో అధికారం కోల్పోయే ప్రమాదముందని జేఎంఎం-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి భయపడుతోంది. రాజ్‌భవన్ వేదికగా ఏదో కుట్ర జరుగుతోందని అనుమానపడుతున్నారు. ఇప్పటికే ఛండీగఢ్ మేయర్ పదవిని బీజేపీ తన్నుకుపోయింది. ఆప్, కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఉండి కూడా మేయర్ పదవిని కోల్పోయే దుస్థితి ఏర్పడింది. ఇంకోవైపు బీహార్‌లో కూటమి ముక్కలైంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జేఎంఎంకు మద్దతు ఇస్తున్న 47 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సాయంత్రానికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లు ఉన్నాయి. జేఎంఎంకు 41 స్థానాల బలం ఉంది. ప్రభుత్వం ఏర్పడడానికి ఈ బలం సరిపోతుంది. అయినా కూడా కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. ఇప్పటికే చంపయ్‌కు 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు రాధాకృష్ణన్‌కు తెలియజేశారు. అయినా కూడా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నాన్చుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న ఎమ్మెల్యేలు చేజారకూడదన్న ఆలోచనతో జేఎంఎంకు మద్దతు తెల్పుతున్న 47 మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ సాయంత్రానికి వారంతా చేరుకోవచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kumari Aunty: సీఎం వస్తే ఆయనకు ఇష్టమైనవన్నీ వండిపెడతా..
ఇదిలా ఉంటే ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారించనుంది. సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించబోతున్నారు.
ఇదిలా ఉంటే హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ తోటి కోడలు సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. విభేదాలతో రాజకీయ సంక్షోభం తలెత్తకూడదనే చంపయ్ సోరెన్‌కు జేఎంఎం అధిష్టానం అవకాశం ఇచ్చినట్లు సమాచారం.