JD Lakshminarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ చెబుతూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ముందుకు వెళ్లడంలేదని ప్రకటించింది. అయితే, అంతకుముందే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల బృందం స్టీల్ ప్లాంట్‌లో పర్యటించడంతో.. ఆ ప్రకటన తర్వాత క్రెడిట్ గేమ్ నడిచింది.. మా పోరాటం వల్లే కేంద్రం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందంటే.. లేదు మా వల్లే అంటూ అంతా హడావిడి స్టార్ట్ చేశారు.. ఈ నేపథ్యంలో.. స్టీల్ ప్లాంట్ విషయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ కార్మికులు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు.. వారికి స్థానికుల నుంచి ఘన స్వాగతం లభిస్తోంది. గోపాలపట్నం దగ్గర గులాబీ పువ్వులు ఇచ్చి సంఘీభావం ప్రకటించారు స్థానికులు.. ఇక, ఈ పాదయాత్రలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ కీలకవ్యాఖ్యలు చేశారు..
Read Also: Nizamabad News: రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన వైనం.. వీడియో వైరల్
స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-EOIకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.. అయితే, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు EOIకి వచ్చినప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం అంటున్నారు లక్ష్మీనారాయణ.. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపించిన చొరవ అభినందనీయమన్న ఆయన… EOIలో భాగస్వామ్యం అవుతుందని భావిస్తున్నాను అన్నారు.. అవసరం అయితే EOIను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.. రాజకీయాలకు అతీతంగా స్టీల్ పరిరక్షణ పోరాటం సాగించాల్సిందేనని పిలుపునిచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ.. కాగా, గతంలో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ చేసిన విషయం విదితమే.. “సింగరేణికి చెందిన ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈవోఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని , RINLని బలోపేతం చేయాలని ఆలోచించడానికి కారణం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలి” అంటూ ట్వీట్ చేసిన విషయం విదితమే.