JC Prabakar Reddy: పోలీసులను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజునే జేసీ ప్రభాకర్ రెడ్డి ఐపీఎస్ అధికారిని అవమానించారని, ఆయన వ్యాఖ్యలు పోలీసులను కించపరిచేలా అలాగే భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని పోలీస్ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జిల్లా పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది.
ఇకపోతే తాడిపత్రిలో ప్రస్తుతం శాంతియుత వాతావరణం ఉందంటే అది ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వల్లనే అని పోలీస్ సంఘం స్పష్టం చేసింది. ఆయన నిజాయితీగా, నిక్కచ్చిగా తన విధులను నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. తాడిపత్రిలో ఎప్పుడు శాంతి భద్రతల సమస్య వచ్చినా పోలీసులు ముందుండి పనిచేశారని, గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా అనేకసార్లు రక్షణ కల్పించామని గుర్తు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు పోలీసులను గౌరవిస్తుంటే.. ఇంకోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను అవమానించడం సరికాదని పోలీస్ సంఘం నేతలు అన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరితో సమస్య ఉంటే.. దానిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కానీ, ఇలా బహిరంగంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఈ సంఘటనను తాము తప్పకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. జేసీ ప్రభాకర్ రెడ్డి వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.