NTV Telugu Site icon

Jay Shah: రోహిత్‌ కెప్టెన్సీలోనే టీ20 ప్రపంచకప్‌కు భారత్

Rohit Sharma

Rohit Sharma

Jay Shah: ఈ ఏడాది వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న టీ-20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ-20 ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆడుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా బుధవారం తెలిపారు. వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నారు. సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంకు బీసీసీఐ మాజీ సెక్రటరీ నిరంజన్ షా పేరు పెట్టే కార్యక్రమంలో జే షా మాట్లాడుతూ.. 2023లో అహ్మదాబాద్‌లో వరుసగా 10 విజయాలు సాధించిన తర్వాత ప్రపంచకప్ గెలవలేకపోయామని, అయితే మనం హృదయాలను గెలుచుకున్నామని అన్నారు. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో బార్బడోస్ (టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక)లో భారత జెండాను నాటుతామని మీకు హామీ ఇస్తున్నానని జేషా వెల్లడించారు.

Read Also: Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం

ఈ సందర్భంగా నిరంజన్ షా, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్షర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడకపోవడంపై జేషా మాట్లాడుతూ, విరాట్ పెద్ద కారణం లేకుండా సిరీస్‌లో ఆడని ఆటగాడు కాదు. భవిష్యత్తులో అతని పాత్ర గురించి చర్చిస్తామన్నారు. దీంతో పాటు ప్రతి ఆటగాడు రంజీ ట్రోఫీలో ఆడాల్సిందేనని జే షా స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ మాట్లాడుతూ.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సూచనలను పాటిస్తామని చెప్పారు.