Palla Rajeshwar Reddy : జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రాజెక్టును పూర్తిచేసి, ఫేజ్ 3లో మూడు మోటర్లతో 1800 క్యూసెక్కుల నీటి సరఫరా కోసం ఏర్పాట్లు చేసింది కేసీఆర్ ప్రభుత్వం” అని తెలిపారు. అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ, “ఆరు నియోజకవర్గాలకు నీరందించే దేవాదుల లోయర్ డ్యామ్‌కు కేవలం 6 కోట్లు కేటాయించలేని కాంగ్రెస్ ప్రభుత్వం అజ్ఞానపు పాలకుల చేతిలో ఉంది” అంటూ విమర్శలు చేశారు.
చలివాగు వద్ద ఉద్యోగులు 30 రోజులు సమ్మె చేసి మోటర్లు బంద్ చేస్తే, రైతులకు నీరు ఇవ్వలేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. “నేను ఇరిగేషన్ అధికారులతో, సెక్రటేరియట్ అధికారులతో, ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి 6 కోట్ల రూపాయలు మంజూరు చేయించాను. కానీ కడియం శ్రీహరి మాత్రం స్టైల్‌గా మేమే నీరందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు.
“గండిరామరం రిజర్వాయర్ నుండి స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒక్క ఎకరానికి కూడా నీరు పారదు. కడియం శ్రీహరి డ్రామా చేయడానికి మాత్రమే రిజర్వాయర్ వద్దకు వచ్చారు” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. “తాను సీనియర్ అని, దేవాదుల ప్రాజెక్టు తాను తెచ్చానని చెప్పుకునే కడియం, మేమేసిన ఓటుతో గెలిచి ఇప్పుడు రాజకీయ నాటకాలు ఆడుతున్నారు” అని మండిపడ్డారు. “స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
ఈ నెల 27న జరగబోయే బహిరంగ సభ గురించి ప్రస్తావిస్తూ, “ఈ సభ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఐదవ మహాసభగా నిలవబోతుంది. జనగామ జిల్లా నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలి” అని పిలుపునిచ్చారు.
Bengaluru: కాంగ్రెస్ నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య..