Nadendla Manohar: దేశ రాజకీయాలలో మార్పు తీసుకురావాలనేది జనసేన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దని.. జనసేన కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోయారని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ మర్చిపోరన్నారు. పచ్చటి కోనసీమలో ఘర్షణ వాతావరణం వద్దని ధైర్యంగా నిలబడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనసేనను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రవర్తిస్తుందని చెప్పారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను డోర్ డెలివరీ చేసినప్పుడు మీ ఫోన్ కాల్ రాలేదే? డాక్టర్ సుధాకర్ ను వేధించినప్పుడు జగన్ ఫోన్ కాల్ ఏది? అని ప్రశ్నించారు. ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చినప్పుడు మీ సంగతి చూస్తామంటారా? వైసీపీ చేస్తున్న కుళ్లు, రాజకీయాలు, కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
“ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ బెదిరిస్తున్నారు. తెనాలికి వచ్చి గంజాయి బ్యాచ్ ను పరామర్శించారు. పిఠాపురంలో కూడా అదే చేశారు. మేం చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తాం. వైసీపీ కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాలి. శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. దీని వెనుక కుట్ర ఉంది. కుటుంబంలో కలహాలు పెట్టేవిధంగా జగన్ రాజకీయాలు చేస్తున్నారు. ఒక్క జగన్ మాత్రమే ఇలాంటి రాజకీయాలు చెయ్యగలరు. సోషల్ మీడియాలో రాజకీయ కోణంలో మహిళలపై దుష్ప్రచారం చేస్తున్నారు. జనసేన ఓట్లకోసం రాజకీయాలు ఎప్పుడూ చెయ్యదు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం. మూడు పార్టీలు కలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ సంతోష్ ఆలోచించారు.
సమాజంలో చీలికలు తెచ్చేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో చీలికలు తెచ్చేవారిని చట్టం ముందు నిలబెడదాం. చట్టం ముందు అందరూ సమానమే. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలి.” అని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.