ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమికి గాజు గ్లాసు గండం వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు సీట్లను పంచుకున్నాయి. 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మిగిలిన చోట్ల, టీడీపీ, బీజేపీలకు జనసేన మద్దతుగా నిలిచింది. ఆ పార్టీ సింబల్ గాజు గ్లాసు కాగా.. ఫ్రీ సింబల్ జాబితాలో జనసేన గాజు గ్లాస్ గుర్తును పెట్టింది ఈసీ. జనసేన పోటీలో లేని చోట ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తు ఉండటంతో కూటమి నేతలు తలలుపట్టుకున్నారు.
READ MORE: PM Modi: “ప్రధాని మోడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి”.. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే..?
టీడీపీ, బీజేపీ అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. జనసేనకు గుర్తింపు లేకపోవడంతోనే సమస్య ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు ఆరు శాతం ఓట్లు సాధించారు. తాము కూటమిగా పోటీ చేస్తున్నామని.. ప్రస్తుతం 10 శాతానికి పైగా సీట్లల్లో పోటీ చేస్తున్నామని జనసేన ఈసీఐ దృష్టికి తీసుకెళ్లింది. వేరే అభ్యర్థులకు సింబల్ కేటాయించవద్దని కోరింది. కూటమి కూడా ఈ అంశంపై తీవ్ర ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు సంబంధించిన గుర్తు ఫ్రీ సింబల్ పెట్టే అవకాశం ఉంది. స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా.. గాజు గ్లాసు కేటాయించాలని కోరితే వారికి ఆ సింబల్ ను కేటాయించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ మేరకు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. స్వతంత్ర అభ్యర్థికి గ్లాసు గుర్తు కేటాయిస్తే.. జనసేన అభ్యర్థి అనుకొని ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ అంశంపై జనసేన చివరి ప్రయత్నం చేస్తోంది. చివరి నిమిషం ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందని కూటమి ఆశాభావం వ్యక్తం చేస్తోంది.