Pawan Kalyan: వారాహి విజయ యాత్రతో రాష్ట్రం కలియ తిరిగేందుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే.. రెండు విడతల్లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను చుట్టేశారు.. ఇక, ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు.. ఈ సారి ఉక్కు నగరం విశాఖను ఎంచుకున్నారు.. వైజాగ్ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభించనున్నట్టు ప్రకటించారు పవన్ కల్యాణ్.. ఈ రోజు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో విశాఖ జిల్లా నాయకులు, వారాహి యాత్ర కమిటీలతో సమావేశం నిర్వహించారు జనసేనాని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీ నుంచి వారాహి యాత్ర మూడో విడత ప్రారంభం అవుతుందన్నారు. విశాఖపట్నం నగరంలో ఈ యాత్ర మొదలవుతుంది.. అదే రోజు విశాఖపట్నంలో వారాహి వాహనం నుంచి సభ నిర్వహించనున్నారు. విశాఖ జిల్లాలో ఈ నెల 19వ తేదీ వరకూ వారాహి యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన పరిశీలనలు ఉంటాయి. పర్యావరణాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాలను పవన్ సందర్శిస్తారని.. విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని జనసేన ప్రకటించింది.
విశాఖలో వైసీపీ అక్రమాలు వెలుగులోకి తెచ్చేలా వారాహి యాత్ర కొనసాగుతుందన్నారు పవన్ కల్యాణ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో విశాఖలో విధ్వంసం జరుగుతుందని విమర్శించారు. మూడో విడత యాత్ర పూర్తయ్యేలోపు భూకబ్జాలు ఆగాలని వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర వనరుల దోపిడీని నిలువరిద్దాం అంటూ విశాఖ జిల్లా నాయకులు, వారాహి యాత్ర కమిటీలతో నిర్వహించిన సమావేశంలో పిలుపునిచ్చారు పవన్.. వారాహి యాత్ర గురించి దేశం మొత్తం చెప్పుకోవాలి.. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేలా చేద్దాం అన్నారు. పంచాయితీరాజ్ వ్యవస్థను చంపేందుకే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
విశాఖలో వైసీపీ అక్రమాలు వెలుగులోకి తెచ్చేలా వారాహి యాత్ర
• 10వ తేదీ నుంచి విశాఖలో వారాహి విజయ యాత్ర
• వైసీపీ పాలనతో విశాఖలో విధ్వంసం
• మూడో విడత యాత్ర పూర్తయ్యేలోపు భూకబ్జాలు ఆగాలి
• ఉత్తరాంధ్ర వనరుల దోపిడీని నిలువరిద్దాం
• వారాహి యాత్ర గురించి దేశం మొత్తం చెప్పుకోవాలి… pic.twitter.com/ZzVuJCnZRp
— JanaSena Party (@JanaSenaParty) August 3, 2023