ఇంగ్లండ్ యువ వికెట్ కీపర్ జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ సరసన నిలిచాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్ ఉన్నాడు. డికాక్ రికార్డును జేమీ స్మిత్ సమం చేశాడు. అంతేకాదు అతి తక్కువ బంతుల్లో (1303) టెస్టుల్లో వెయ్యి పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్‌గా మరో రికార్డు సాధించాడు. సర్ఫరాజ్ అహ్మద్ (1311), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (1330 ), నిరోషన్ డిక్వెల్లా (1367), క్వింటన్ డికాక్ (1375) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
జేమీ స్మిత్ గత సంవత్సరం టెస్ట్ అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన స్మిత్… తొలి మ్యాచ్‌లోనే 70 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం భారత్‌తో సిరీస్‌లో దుమ్ములేపుతున్నాడు. తొలి టెస్టులో 40, 44 రన్స్ చేసిన స్మిత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం (184), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (88) బాదాడు. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టులో హాఫ్ సెంచరీ చేశాడు.
Also Read: Joe Root: టెస్టుల్లో జో రూట్ చరిత్ర.. రాహుల్ ద్రవిడ్ రికార్డు బ్రేక్!
టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన వికెట్ కీపర్‌లు:
# జేమీ స్మిత్ – 1303 బంతులు
# సర్ఫరాజ్ అహ్మద్ – 1311 బంతులు
# ఆడం గిల్‌క్రిస్ట్ – 1330 బంతులు
# నిరోషన్ డిక్‌విల్లా – 1367 బంతులు
# క్వింటన్ డి కాక్ – 1375 బంతులు