Jagadish Reddy vs Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమావేశం అయ్యారు. సోమవారం ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌పై చర్చిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు కూడా సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ఫామ్‌హౌస్‌లో ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం బీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ‘లిల్లీపుట్ నాయకుడు’ అంటూ జగదీష్ రెడ్డిని కవిత విమర్శించిన విషయం తెలిసిందే. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేశాడని, కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు ఏరోజూప్రజా పోరాటాల్లో పాల్గొనలేదన్నారు. బీఆర్ఎస్తో మీకేం సంబంధం? అంటూ జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.
నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కల్వకుంట్ల కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అంటూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరోసారి వల్లె వేసేందుకు కవిత చేసిన ప్రయత్నానికి నా సానుభూతి అని పేర్కొన్నారు. కవితను తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని జగదీష్ రెడ్డి అనడమే ఈ వివాదానికి దారి తీసింది. ఇద్దరి మధ్య వివాదం బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఈ అంతర్గత పోరును ఎలా పరిష్కరిస్తారో చూడాలి.