IT Sector: కొవిడ్ మహమ్మారి అన్నిరంగాలకు నష్టం చేస్తే, ఐటీరంగం మాత్రం అనూహ్యంగా లాభపడింది. మన ఐటీ కంపెనీలకు పెద్దఎత్తున కొత్త ప్రాజెక్టులు లభించాయి. నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు పెద్దఎత్తున ఐటీ నిపుణులను కంపెనీలు నియమించుకున్నాయి. గత రెండేళ్లలో ఇదే పరిస్థితి. కొత్త నైపుణ్యాలు కలిగిన వారి కోసం ఐటీ కంపెనీలు కళాశాలల ప్రాంగణాల్లో ఎంపికలు కూడా పెద్దఎత్తున చేపట్టాయి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. భారత ఐటీ సేవల రంగంలో నియామకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల సగటుతో పోలిస్తే.. అక్టోబరులో ఐటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో నియామకాలు 43 శాతం తగ్గాయి. సీనియర్ మేనేజ్‌మెంట్ నిపుణుల నియామకాలైతే 68 శాతానికి పడిపోయాయి. ఐటీ కంపెనీలకు నియామక సేవలు అందించే సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సంస్థ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
దీనికి చాలా కారణాలు ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది. కొలిక్కి రాని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, స్టార్టప్‌ల్లో పెట్టుబడులు తగ్గిపోవడం, ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీలు ఐటీ ఖర్చులు తగ్గించుకోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది చివరి వరకు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితే 2023 జనవరి-మార్చి త్రైమాసికం నుంచి ఐటీ కంపెనీల్లో నియామకాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని సీఐఈఎల్ హెచ్‌ఆర్ అభిప్రాయపడింది.
Rishi Sunak: కలవరపెడుతున్న వలసలు.. విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ఆంక్షలు?
కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య సంరక్షణ, రిటైల్, ఉత్పత్తి రంగాల్లో డిజిటల్ ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపట్టారు. అవి ఇప్పుడు దాదాపు పూర్తయ్యే స్థితికి చేరుకున్నాయి. గత రెండేళ్ల స్థాయిలో కొత్తగా డిజిటల్ ప్రాజెక్టులు వచ్చే ఏడాది, రెండేళ్ల పాటు మన ఐటీ కంపెనీలకు లభించకపోవచ్చనే అభిప్రాయం ఉంది. అందుకే నూతన నియామకాలను సంస్థలు తగ్గించేస్తాయంటున్నారు నిపుణులు. ఆ సమయంలో ఐటీ సేవలకు డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో ఈ రంగంలో నియామకాలూ అదే స్థాయిలో పుంజుకున్నాయి. రెండేళ్ల పాటు జోరుగా కొనసాగిన టెకీల హైరింగ్.. ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)లో మళ్లీ ప్రీ-కొవిడ్ స్థాయికి తగ్గిందని గ్లోబల్ ఐటీ రీసెర్చ్ కంపెనీ ఐఎస్‌జీ తెలిపింది. కాగా, భారత జాబ్ మార్కెట్లో గత రెండేళ్లలో అత్యధిక నియామకాలు జరిపిన రంగం ఐటీనే. మరో రెండు త్రైమాసికాల పాటు టెకీల నియామకాలు అంతంత మాత్రంగానే ఉండవచ్చని క్వెస్ కార్ప్ చైర్మన్ అజిత్ ఇసాక్ అన్నారు. ఈ పరిణామం మొత్తం జాబ్ మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చన్నారు.
ఇటీవల ట్విటర్, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా పలు అమెరికా టెక్నాలజీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా 25,000 మందికి పైగా ఉద్యోగం కోల్పోయారు. ఈ కంపెనీలకు చెందిన భారత కార్యాలయాల్లోనూ పెద్ద సంఖ్యలోనే ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలిసిందే. అంతేకాదు, కొత్త పెట్టుబడులు నిలిచిపోవడంతో ఈ ఏడాది దేశీయ స్టార్టప్‌లు కూడా 20,000 మందికి పైగా ఉద్యోగం నుంచి తొలగించాయి. వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు స్టార్టప్ రంగంలో తీసివేతలు కొనసాగవచ్చన్న అంచనాలున్నాయి. మార్కెట్లో ఐటీ నిపుణులకు డిమాండ్ తగ్గడంతో డిసెంబరు త్రైమాసికం నుంచి ఉద్యోగుల వలసలు కూడా తగ్గవచ్చని కంపెనీ భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో చాలా కంపెనీల్లో ఈ వలసల రేటు 20 శాతం ఎగువనే నమోదైంది.
Ayyappa Swami Irumudi: అయ్యప్ప స్వాములు తీసుకోళ్లే ఇరుముడి దేనికి ప్రతీక
నియామకాల జోరు తగ్గడంతో ఇనాళ్లూ కోర్కెల కొండెక్కి కూర్చున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దిగివస్తున్నారు. కొత్త ఉద్యోగంలోకి మారే సమయంలో, ఇదివరకు 60 నుంచి 100 శాతం హైక్‌ను డిమాండ్ చేసిన టెకీలు.. ప్రస్తుతం 20 నుంచి 30 శాతం హైక్ ఆఫర్ చేసినా సుముఖత చూపుతున్నారని ఐటీ జాబ్ కన్సల్టెంట్లు, హెచ్‌ఆర్ మేనేజర్లు, రిక్రూటర్లు అంటున్నారు. ఐటీలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లడం, మున్ముందు హైరింగ్ దాదాపు స్తంభించవచ్చన్న భయాలు ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో టెక్ కంపెనీలు ముందు జాగ్రత్త పడుతున్నాయి. పలు కంపెనీలిప్పటికే కొలువులకు కోతలు పెట్టాయి. కొత్త నియామకాలు నిలిపివేయనున్నట్లు తెలిపాయి. ఈ పరిణామం ఐఐటీల వంటి ప్రముఖ విద్యా సంస్థల ప్రాంగణ నియామకాలపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.