Gundlakamma Project: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్టు (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన మరో గేటు కొట్టుకుపోయింది.. గతంలో కొట్టుకుపోయిన 3వ గేటు మరమ్మతులు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చేయలేదనే విమర్శలు వినిపిస్తుండగా.. శుక్రవారం రాత్రి రెండో గేటు అడుగు భాగం కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో రాత్రి నుంచి ప్రాజెక్టు నుంచి దిగువకు వృథాగా నీరు పోతూనే ఉంది. ప్రాజెక్టులోని నీళ్లు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది.. అయితే, నీటి ఉధృతికి గేటు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు స్టాప్‌లాక్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేస్తున్న క్రమంలో హుక్ తెగిపోయి నీటిలో పడిపోయింది. ఈ క్రమంలో నీటిని ఆపడం కష్టంగా మారింది. నీటిలో పడిపోయిన హుక్‌ను బయటకు తీసి.. స్టాప్‌లాక్‌తో వెల్డింగ్ చేసే ప్రక్రియ పూర్తి చేసి స్టాప్‌లాక్ అమర్చేందుకు ప్రయత్నించాల్సి ఉండగా.. చీకటి పడడంతో పాటు వెల్డింగ్ ప్రక్రియ చేపట్టేందుకు సాంకేతిక సిబ్బంది లేకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి.
Read Also: Srilanka: అంధకారంలో శ్రీలంక దేశం.. సిస్టమ్ ఫెయిల్యూర్‌తో విద్యుత్ అంతరాయం..
ప్రాజెక్టులో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. నీరు వృథాగా కిందికి పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 3వ నంబర్ గేటు కొట్టుకుపోవటంతో పూర్తిస్థాయిలో ఇప్పటివరకు మరమ్మతులు పూర్తికాకపోగా.. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో.. మరోగేటుకు అదే పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు.. అయితే, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు అని అధికార యంత్రాంగం సూచిస్తోంది.. ఇదే సమయంలో.. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.. మరోవైపు.. ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 2వ నంబర్ గేటును ఈ రోజు టీడీపీ నేతల బృందం పరశీలించింది. టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్ తదితర నేతలు ఈ రోజు గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను పరిశీలించారు.