గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. తన కెరీర్ పతనం వెనుక ధోనీ హస్తం ఉందని అప్పట్లో పఠాన్ పరోక్షంగా చెప్పాడు. మెరుగైన ప్రదర్శన చేసిన తర్వాత కూడా తనను జట్టు నుంచి తప్పించారని, 2008 ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తాను బాగా బౌలింగ్ చేయలేదని ధోనీ మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హుక్కా తాగే వాళ్లకే ధోనీ జట్టులో చోటు అని, హుక్కా తాగలేదనే కారణంతోనే తనను జట్టు నుంచి తప్పించాడని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఇర్ఫాన్ పఠాన్ అరంగేట్రం చేశాడు. 2003-04 ఆస్ట్రేలియా పర్యటనలో పఠాన్‌కు తొలి అవకాశం లభించింది. ఒకానొక సమయంలో ఇర్ఫాన్ అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ప్రధాన ఆల్‌రౌండర్. 2009లో అతడి కెరీర్ గాడి తప్పగా.. 2011 వన్డే ప్రపంచకప్‌కు ముందు ప్రభావం పూర్తిగా తగ్గింది. దాంతో మెగా టోర్నీలో భారత జట్టులో స్థానం లభించలేదు. 2011 వన్డే ప్రపంచకప్‌కు ఇర్ఫాన్ స్థానంలో స్థానంలో అతడి అన్నయ్యను యూసుఫ్‌కు స్థానం కల్పించారు. మరోవైపు సురేష్ రైనాను బ్యాకప్‌గా ఎంపిక చేశారు. అంతకుముందు 2009లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఇర్ఫాన్, యూసుఫ్ కలిసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఓ మ్యాచ్‌లో 28 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి ఉండగా.. అన్నదమ్ములు చెలరేగి జట్టును గెలిపించారు.
Also Read: Hyderabad Metro: మెట్రో రైలులో గుండె, ఊపిరితిత్తుల తరలింపు.. 45 నిమిషాల్లోనే 2 ఆస్పత్రులకు!
కీలక మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన తర్వాత ఇర్ఫాన్ పఠాన్‌ను భారత జట్టు నుంచి తొలగించారు. ఈ విషయంపై అప్పటి హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను ఇర్ఫాన్ ప్రశ్నంచగా.. రెండు కారణాలు చెప్పాడు. కొన్ని విషయాలు తన చేతుల్లో ఉండవని, తుది జట్టు ఎంపిక కెప్టెన్ చేతుల్లో ఉంటుందని కిర్‌స్టెన్ చెప్పినట్లు ఇర్ఫాన్ తెలిపాడు. జట్టుకు 7వ స్థానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అవసరమని జట్టు భావిస్తోందని కిర్‌స్టెన్ చెప్పారని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ‘నాకు ఎవరి గదిలో హుక్కా తాగే అలవాటు లేదు. ఎవరు ఏమి చేసేవారో అందరికీ తెలుసు. క్రికెటర్ పని మైదానంలో బాగా రాణించడమే. నేను దీనిపై మాత్రమే దృష్టి పెట్టేవాడిని’ అని ఇర్ఫాన్ చెప్పాడు. ఆ సమయంలో ఎంఎస్ ధోనీ హుక్కా తాగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో హుక్కా తాగే ఆటగాళ్లకే ధోనీ జట్టులో ప్రాధాన్యత ఇచ్చేవారనే ప్రచారం జరిగింది.