తాను ఎప్పుడూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండాలనుకోనని, 20 ఓవర్లు మైదానంలో ఉంటూ ప్రభావం చూపించాలనుకుంటాను అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్‌లో తాను ఎక్కువ రోజులు ఆడలేనని, తన కెరీర్‌కు ఒక ముగింపు ఉంటుందన్నాడు. తన దృష్టిలో టెస్ట్ క్రికెట్ అత్యుత్తమైందని, ఐపీఎల్ ఐదు స్థాయిలు కిందే ఉంటుందన్నాడు. కుర్రాళ్లు గౌరవం కావాలనుకుంటే టెస్ట్ క్రికెట్‌ను ఎంచుకోవాలని సూచించాడు. ఐపీఎల్ 2025 వేలం తర్వాత చాలా మంది తమ జట్టుని ట్రోల్ చేశారని, ఈ విజయంతో అందరికి సమాధానం చెప్పం అని కోహ్లీ పేర్కొన్నాడు. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచింది.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘ఐపీఎల్ ఎంతో తీవ్రత, నాణ్యత గల టోర్నమెంట్. నేటి ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నేను పెద్ద టోర్నమెంట్స్, పెద్ద మ్యాచులు గెలవాలని కోరుకునే వ్యక్తిని. ఇన్నేళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. ఈరోజు అది సాధించాం. ఇక చిన్న పిల్లాడిలా నిద్రపోతాను. ఎక్కువ రోజులు ఆడలేను. నా కెరీర్‌కు ఓ ముగింపు ఉంది. నేను వీడ్కోలు పలికి ఇంట్లో కూర్చున్నపుడు.. నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చానని సంతోషముగా ఉండాలి. నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడలేను. 20 ఓవర్లు ఫీల్డింగ్ చేసి ఫీల్డ్‌లో ప్రభావం చూపాలనుకుంటున్నాను. అలాంటి మనస్తత్వం కలిగిన ప్లేయర్‌ను నేను. ఆ ఆ దృక్పథంను నాకు ఇచ్చినందుకు దేవునికి చాలా కృతజ్ఞతలు. వీలైనంత కష్టపడతా. జట్టుకు సహాయం చేయడానికి అన్ని మార్గాలను వెతుకుతా. జట్టు విజయం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటా’ అని చెప్పుకొచ్చాడు.
Also Read: RCB Victory Parade: నేడు బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్.. ఇక ఎర్ర సముద్రమే!
‘మా మేనేజ్‌మెంట్ సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేను. ఆర్సీబీ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లే స్టార్లు ఉన్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలం సమయంలో చాలా మంది మా వ్యూహాలను ప్రశ్నించారు. జట్టుని ట్రోల్ చేశారు. రెండు రోజుల తర్వాత జట్టును చూస్తే నాకు చాలా ఆత్మవిశ్వాసం వచ్చింది. విజయమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఈ విజయంతో మా జట్టును అభినందించకుండా ఉండలేను. జట్టులోని ప్రతి ఒక్కరూ, ప్లేయింగ్ ఎలెవెన్‌లో ప్రతి ఒక్కరూ లేకుండా టైటిల్ సాధ్యం కాదు. ఈ సమయంలో నేను ఎక్కువగా మాట్లాడలేను. ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులతో సంబరాలు చేసుకోవడం ఎంతో బాగుంది. నా గురించి మాట్లాడుకోవడం ఇష్టం లేదు. ఈ విజయం బెంగళూరుకు, ఆటగాడికి, కుటుంబాలకు, యాజమాన్యానికి అంకితం. నా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇది అందులో ఒకటి. నాకు ఇప్పటికీ టెస్టు క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ ఫార్మాట్‌ను గౌరవంగా చూడాలని యువ క్రికెటర్లను కోరుతున్నా. ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌లో రాణిస్తే అన్ని సాధ్యమవుతాయి. మీలాంటి దిగ్గజాలతో (మాథ్యూ హేడెన్) క్రికెట్ ప్రపంచానికి గౌరవం ఉంటుంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.