Mitchell Starc reacts to becoming the costliest IPL auction buy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికాడు. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది. స్టార్క్ కోసం కేకేఆర్ సహా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆసీస్ యార్కర్ల కింగ్‌ను దక్కించుకునేందుకు కోల్‌కతా ఎక్కడా తగ్గలేదు. ఏకంగా నాలుగు టీమ్స్ పోటీపడడంతో స్టార్క్‌కు రికార్డు ధర దక్కింది.
ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర దక్కడంపై మిచెల్ స్టార్క్ స్పందించాడు. ఐపీఎల్ ధరతో తాను షాక్‌కు గురయ్యానని, ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదన్నాడు. ‘ఐపీఎల్ 2024 వేలం ధరతో షాక్‌కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని నేను అసలు ఊహించలేదు. 8 ఏళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్‌లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా. విలువ పెరిగినా.. నా ఆటతీరు ఎప్పుడూ మారలేదు. భారీ మొత్తం కాబట్టి ఒత్తిడి సహజమే. అయితే అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని స్టార్క్ తెలిపాడు.
Also Read: Viral Video: కారుతో స్టంట్ చేయబోయి.. స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది!
‘ఈ ఏడాది ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టులో చేరినందుకు థ్రిల్‌గా ఉన్నాను. సొంత అభిమానులు మధ్య మ్యాచ్ ఆడడానికి ఈడెన్ గార్డెన్స్‌కి వెళ్లడానికి వేచి ఉండలేను. కేకేఆర్ అభిమానులను చూడాలని ఎదురు చూస్తున్నాను’ అని కేకేఆర్ అప్‌లోడ్ చేసిన వీడియోలో మిచెల్ స్టార్క్ పేర్కొన్నాడు. స్టార్క్ గతంలో రెండు సార్లు మాత్రమే ఐపీఎల్ ఆడాడు. 2014, 15 సీజన్‌లలో బెంగళూరు తరపున స్టార్క్ ప్రాతినిథ్యం వహించాడు. 27 మ్యాచ్‌లలో 7.16 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. 2018లో కోల్‌కతా వేలంలో తీసుకున్నా.. గాయంతో టోర్నీకి ముందే తప్పుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత స్టార్క్ మళ్లీ ఐపీఎల్లో ఆడనున్నాడు.